టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత మిగతా వారి కంటే కాస్త విభిన్నమనే చెప్పాలి. కేవలం కమర్షియల్ సినిమాల్లోనే నటించడానికి ఆమె ఒప్పుకోరు. మంచి కథలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సామ్ ఎప్పుడూ ముందుంటారు. ఒకవైపు పెద్ద హీరోల సరసన నటిస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తుంటారు. అలాంటి సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో కలసి ఆమె చేస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ హిందీ రీమేక్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీంతో సామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. మయోసైటిస్ రావడం వల్ల ఆమె సినిమాలన్నీ ఆలస్యం అవుతూ వచ్చాయి. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకే సామ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మయోసైటిస్ రాకపోయి ఉంటే సామ్ పరిస్థితి మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టుల్లో ఆమె నటించేందని చెబుతున్నారు. ‘పుష్ప’, ‘ఫ్యామిలీమ్యాన్-2’తో వచ్చిన క్రేజ్‌ను ఆమె బాగా క్యాష్ చేసుకునేదని అంటున్నారు.
సినిమాలను మానేసి రెస్ట్ తీసుకోవాలని సమంత ఫిక్స్ అయ్యారు. అందుకే ఎలాంటి మూవీ కమిట్మెంట్స్ లేకుండా ఆమె చూసుకుంటున్నారు. తనకు అడ్వాన్స్‌లు ఇచ్చిన మూడు ప్రొడక్షన్ హౌస్‌లకు వాటిని ఆమె తిరిగి ఇచ్చేశారని సమాచారం. ఒక్కో చిత్రానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సామ్.. వాటిని తిరిగి ఇచ్చేయడం ద్వారా దాదాపుగా రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు నష్టపోయారని టాలీవుడ్ టాక్. ఒక ఏడాది పాటు సినిమాలు చేయకపోవడంతో ఈ క్యూట్ బ్యూటీకి భారీగానే నష్టం ఏర్పడనుందని సమాచారం. అయితే సినిమాలు చేయకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్స్ ద్వారా ఆమె బాగానే సంపాదించే ఛాన్స్ ఉంది. మూవీస్ చేయకపోయినా యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా సామ్‌కు బాగానే ఆదాయం ఉందని సమాచారం.