iDreamPost
android-app
ios-app

అణిచివేతను ప్రశ్నించిన విరాట పర్వం

  • Published Jun 06, 2022 | 1:36 PM Updated Updated Jun 06, 2022 | 1:36 PM
అణిచివేతను ప్రశ్నించిన విరాట పర్వం

ఈ నెల17న విడుదల కాబోతున్న విరాట పర్వం ట్రైలర్ లాంచ్ నిన్న కర్నూలులో జరిగింది. ఊహించని విధంగా వచ్చిన హోరు గాలి వాన వల్ల ఈవెంట్ మధ్యలోనే ఆపేయాల్సి రావడం అభిమానులను నిరాశ కలిగించింది. అయినా కూడా సాయి పల్లవి, రానాలు ఫ్యాన్స్ తో ముచ్చటించే ప్రయత్నం చేశారు. కానీ ప్రకృతి భీభత్సం ఆగకపోవడంతో అక్కడితో ముగించక తప్పలేదు. దీని సంగతెలా ఉన్నా ఇప్పటిదాకా అంచనాల విషయంలో వెనుకబడి ఉన్న ఈ నక్సల్ డ్రామాకు హైప్ వచ్చేలా వీడియోని కట్ చేయడం విశేషం. 90ల కాలంనాటి ఉద్యమాలను ఇప్పుడు ఎవరు చూస్తారన్న అభిప్రాయాలను తిప్పికొట్టేలా ట్రైలర్ ఆకట్టుకుంది.

ఇది కామ్రేడ్ రవన్న కథ. అతను రాసిన విప్లవ సాహిత్యం పట్ల ఆకర్షితురాలై నక్సల్ పోరాటంలో పాలు పంచుకున్న ఓ పల్లె పడుచు వ్యధ. ముప్పై ఏళ్ళ క్రితం ఎన్నో దక్షిణాది రాష్ట్రాలను వణికించిన మావోయిస్టు ఉద్యమం వెనుక ఎందరివో కన్నీళ్లు ఉన్నాయి. స్వార్థం లేకుండా సమాజం కోసం తుపాకీతో అయినా సరే సమానత్వం తీసుకురావాలనే దళాల తిరుబాట్లున్నాయి. పోలీసులు, ప్రభుతంలోని కొన్ని శక్తులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతటి దుర్మార్గానికి తెగబడేవో బయటి ప్రపంచానికి తెలియని చేదు నిజాలున్నాయి. ఇవన్నీ విరాట పర్వంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అటవీ నేపథ్యంలో ఎక్కువగా సాగే రా అండ్ ఇంటెన్స్ డ్రామా ఇది.

దర్శకుడు వేణు ఊడుగుల ట్రెండ్ కి ఎదురీదే సాహసం చేశారు. ఇప్పటి తరానికి అవగాహన లేని నక్సల్ బ్యాక్ డ్రాప్ లో రానా సాయిపల్లవి లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో ఇలాంటి రిస్క్ చేయడం మెచ్చుకోదగినదే; పదునైన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్, ప్రియమణి – నందితా దాస్ – బెనర్జీ – రాహుల్ రామకృష్ణ లాంటి క్వాలిటీ క్యాస్టింగ్ తో చాలా సీరియస్ డ్రామాని రూపొందించారు. మొత్తానికి హైప్ ని తీసుకురావడంలో విరాట పర్వం టీమ్ సక్సెస్ అయ్యింది. గ్రాండియర్లు, ఎంటర్ టైనర్లు రాజ్యమేలుతున్న కాలంలో ఇలాంటి విభిన్న ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి