మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి హేమ సస్పెండ్.. రేపు అధికారిక ప్రకటన..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమపై క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించనుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా). దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమపై క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించనుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా). దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీని నిర్వహిస్తుండగా బెంగళూరు పోలీసులు పట్టుకున్న సంగతి విదితమే. కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రగ్స్ టెస్టు చేయగా.. 86 మందికి పాజిటివ్ వచ్చింది. వారంతా కూడా తెలుగు వారు కావడం గమనార్హం. వారందరూ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు పోలీసులు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్న సంగతి విదితమే. గత నెల 20 జరిగిన రేవ్ పార్టీలో ఆమె పట్టుబడగా.. పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించేలా.. తాను ఆ పార్టీలో లేనని, అదంతా ఫేక్ అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేయడంతో మరింత హైలెట్ అయ్యింది. అయితే కవర్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.. కానీ ఆ పాచికలు పారలేదు.

ఇక నోటీసులు ఇవ్వగా.. తొలుత హేమ హాజరు కాలేదు. ఈ నెల 3వ తేదీన బెంగళూరు పోలీసులు.. హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే ఈ కేసులో హేమ అరెస్టు కావడంతో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్రంగా పరిగణించింది. మా కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. హేమ దోషిగా తేలితే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అరెస్టు కావడంతో.. కమిటీ సభ్యులను అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తుంది. చాలా మంది హేమను సస్పెండ్ చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు అప్రతిష్ట తీసుకు వచ్చిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు అయినా సరే.. మా నుండి సస్పెండ్ చేయాలని మా కార్యవర్గం భావిస్తుందట. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కానీ చాలా మంది తప్పు రుజువు అయ్యేంత వరకు సస్పెండ్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇదిలా ఉంటే..రేవ్ పార్టీలో ఇటీవల అరెస్టు అయిన తర్వాత.. తానేమీ తప్పుచేయలేదంటూ చెప్పుకొచ్చింది హేమ. శుక్రవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  ఇక ఇప్పటికే బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ నిర్వాహకులను  అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.

Show comments