Dharani
Dharani
సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు అంటే అంత స్వచ్ఛంగా ఉండవు.. ఏదో అవసరం కొద్ది.. మీడియా ముందు స్నేహాన్ని నటించే వారే ఎక్కువగా ఉంటారు. నేమ్, ఫేమ్ ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ స్నేహాలు కొనసాగుతాయి అనే భావం ఉంది జనాల్లో. కానీ కొందరు నటీనటుల మధ్య ఉండే రిలేషన్‌ని చూస్తే.. నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తారు. ఈతరం వారి సంగతి తెలియదు కానీ.. 1990, అంతకు మందుకు ఉన్న నటీనటుల మధ్య మంచి స్నేహబంధం ఉండేది. తెర మీద మాత్రమే వారికి పోటీ. బయట అందరకి అందరూ మిత్రులే. ఇప్పటికే చిరంజీవి, ఆయన తరం నటీనటులంతా ఏడాదికి ఒక్కసారైనా కలుసుకుని.. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. సమయం, సందర్భం దొరికిన ప్రతి సారి.. కలుసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా రమ్యకృష్ణ.. మంత్రి రోజా ఇంటికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా రమ్యకృష్ణ.. తన సహచరి నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఇంటికి వెళ్లారు. కుమారుడు రిత్విక్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు, నగరిలోని రోజా ఇంటికి వెళ్లారు రమ్యకృష్ణ. తన చిరకాల నేస్తం.. ఇంటికి రావడంతో.. సంతోషంగా ఆమెని ఆహ్వానించారు రోజా-సెల్వమణి దంపతులు. ఆ తర్వాత కాసేపు రోజా కుటుంబ సభ్యలుతో గడిపారు రమ్యకృష్ణ. ఇంటికి వచ్చిన స్నేహితురాలికి బొట్టుపెట్టి, చీర పెట్టి సాగనంపారు రోజా. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. స్నేహితురాలు రమ్యకృష్ణ తన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు రోజా.
‘‘మంచి స్నేహితులు.. ప్రకాశించే నక్షత్రాల వంటి వారు. అయితే స్టార్స్‌ని ఎప్పుడూ చూడలేం.. అలానే ఇలాంటి స్నేహితులను కూడా తరచుగా చూడలేము, కలుసుకోలేము. కానీ వారు మాత్రం మన కోసం ఎప్పుడు నిలబడతారని మనకు తెలుసు. ఈ రోజు నా ఇంటికి వచ్చి.. నాకేంతో ఆనందాన్ని ఇచ్చిన నా స్టార్ రమ్యకృష్ణకు హృదయపూర్వక స్వాగతం. మేమిద్దరం కలుసుకున్నామంటే.. ఆ రోజుల్లో మా జీవితం ఎలా ఉండేది.. ఆ సమయంలో మేం పంచుకున్న నవ్వులు ఇలా అన్ని జ్ఞాపకాలను కలబోసుకుంటాం. మేమిద్దరం కలిసి ఎన్నాళ్లు అయ్యిందనేది ముఖ్యం కాదు. నా స్నేహితురాలు రమ్యకృష్ణను కలిసినప్పుడు వచ్చే ఆనందమే ముఖ్యం. ఆమె ఎప్పటికి అద్భుతమే’’ అంటూ రమ్యకృష్ణతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోని ఇన్‌స్టాలో పంచుకుంది రోజా. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి.
రోజా ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో చూస్తే.. వీరిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో అర్థం అవుతుంది. సాధారణంగా ఇంటికొచ్చిన ఆడపడుచుకి బొట్టుపెట్టి, చీరతో తాంబూలం ఇవ్వడం తెలుగింటి సంప్రదాయం. రమ్యకృష్ణ తన ఇంటికి రావడంతో.. ఆమెను తోబుట్టువుగా భావించి ఇదే సంప్రదాయాన్ని పాటించారు రోజా. రమ్యకృష్ణను తమ దేవుడి గదిలోకి తీసుకువెళ్లి రోజా బొట్టుపెట్టారు. ఆ తర్వాత ఆమెకు చీర, తాంబూలం ఇచ్చి.. సత్కరించారు. మంగళవారం రమ్యకృష్ణ తన కుమారుడు రిత్విక్‌తో కలిసి తిరుమలకు వచ్చి.. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుమల నుంచి నగరి వెళ్లి రోజాను కలిశారు. నిజానికి రోజా కన్నా రమ్యకృష్ణ సీనియర్. రమ్యకృష్ణ 1985లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టగా.. రోజా 1991లో తెరంగేట్రం చేశారు. ఇక వీరిద్దరూ కలిసి‘ముగ్గురు మొనగాళ్లు’, ‘సమ్మక్క సారక్క’, ‘అన్నమయ్య’ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రోజా పాలిటిక్స్‌లో బిజీగా ఉండగా.. రమ్యకృష్ణ సినిమాలతో బిజీ అయ్యారు.