Nagendra Kumar
రాజమౌళి పుణ్యమా అని, చంద్రబోస్ కల మహిమ, కీరవాణి స్వరమహిమతో ఆస్కార్ వేదికను గడగడలాడించింది నాటునాటు పాట. తాజాగా 2024 ఆస్కార్ అవార్డులో కూడా ఈ పాట సందడి చేసింది. దీంతో ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ రావడంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు.
రాజమౌళి పుణ్యమా అని, చంద్రబోస్ కల మహిమ, కీరవాణి స్వరమహిమతో ఆస్కార్ వేదికను గడగడలాడించింది నాటునాటు పాట. తాజాగా 2024 ఆస్కార్ అవార్డులో కూడా ఈ పాట సందడి చేసింది. దీంతో ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ రావడంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు.
Nagendra Kumar
మాస్కోకెళ్ళే ఆస్కారం లేకపోయినా, విస్కీ సేవిస్తూ శ్రీస్కీనై జీవిస్తా అన్నది శ్రీశ్రీ రాసిన మరో మూడు యాభైలు కవితా సంకలనంలోనిది. అలా ఆస్కారొచ్చే ఆస్కారం లేకపోయినా, మనవాళ్ళు ఆస్కార్ గురించి తెలిసినా తెలియకపోయినా ఆశువుగా మాట్లాడేవారు. ఆస్కార్ అనే సబ్జెక్టు కోటానుకోట్ల మంది భారతీయుల సోదిలోనే లేదెప్పుడూ. ఎవరో ఎక్కడో బాగా సినిమా పక్షులు అనుకున్నవాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళకి తప్పితే ఆస్కార్ అవార్డులు గురించి బొత్తిగా ఏమీ తెలిసే అవకాశమే లేదు.
కానీ ఇప్పుడు అనకాపల్లి, పెదవడ్లపూడిలాటి గ్రామాల్లో కూడా, చదువుసంధ్యా లేని వాళ్ళకి సైతం ఆస్కార్ అంటే పూర్తిగా తెలిసిపోయింది. మొత్తం సబ్జెక్టంతా పట్టుబడిపోయింది. దానికి కారణం ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని రాయప్రోలువారు రాసినట్టుగా, ఇండియన్ ఫ్లాగ్ తొలిసారి ఆస్కార్ వేదిక మీద సగర్వంగా రెపరెపలాడడమే. అదీ మన తెలుగు పాట. పాడనా తెలుగుపాట పరవశనై అన్న దేవులపల్లివారి పాటలా….తెలుగుపాట ప్రపంచం నలుమూలలా దద్దరిల్లిపోయింది. తెలుగంటే ఇండియాలోనే మహానుభావుడు ఎన్టీ ఆర్ వచ్చే వరకూ ఎవ్వరికీ తెలియదు.
ఇంక ప్రపంచం సంగతి ఎందుకు? కానీ రాజమౌళి పుణ్యమా అని, చంద్రబోస్ కలమహిమ, కీరవాణి స్వరమహిమ……ఆస్కార్ వేదికను గడగడలాడించింది నాటునాటు పాట. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ క్రిష్ణ దేవరాయలువారి పద్యాన్ని మించి ప్రపంచభాషలందు తెలుగు లెస్ప అన్న అపూర్వమైన గౌరవాన్ని తెలుగుకి, తెలుగుపాటకి కల్పించారు రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి త్రయం. గత సంవత్సరం నాటునాటు పుట్టించిన కేక ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలో ఎవ్వడూ మరచిపోలేదు. పాటను పల్లవి చరణాలతో సహా కంఠస్థ పెట్టేశారు ప్రతీ వరల్డ్ లాంగ్వేజ్ లోనూ. ఆస్కార్ గెలిచిన సంవత్సరం సరే…..గెలిచిన సంవత్సరం కాబట్టి ఆ కోలాహలం వేరు.
కానీ ఈ సంవత్సరం కూడా నాటునాటు విజువల్ని ఆస్కార్ వేదికమీద షో చేశారు. ఈ సారి ఆస్కార్ గెలుచుకున్న వాట్ వజ్ ఐ మేడ్ అనే పాటకి లభించిన ఆస్కార్ అవార్డును తీసుకోవడానికి ఆ పాటను పాడిన అరియానా గ్రాండే, సింధియా ఎరివో ఇద్దరూ వెళ్తుంటే, వెనుకగా నాటునాటు విజువల్తో సహా ఆడియో ఆస్కార్ హాలులో హోరెత్తిపోయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ చాలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘’నిజంగా ఆశ్చర్యం. ఆస్కార్ వేదికమీద…మళ్ళీ నాటునాటు…మనపాట. ఎంత గౌరవం’’ అని ఉప్పొంగిపోయాడు రామ్ చరణ్. భారతీయులందరి గొంతుతో రామ్ చరణ్ వ్యక్తం చేసిన ఫీలింగ్ ఈ అఖండబారతావనికి చెందుతుంది.