iDreamPost
android-app
ios-app

వాళ్లు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు: కీరవాణి

  • Author singhj Published - 11:12 AM, Mon - 24 July 23
  • Author singhj Published - 11:12 AM, Mon - 24 July 23
వాళ్లు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు: కీరవాణి

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు ఎంఎం కీరవాణి. ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మనసుల్లో ఆయన చెరగని స్థానం సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్​లో ఎన్నో సుమధురమైన పాటలను అందించారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలకు బాణీలు సమకూరుస్తూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా భక్తిరస, ప్రయోగాత్మక చిత్రాలకూ సంగీతాన్ని అందించారాయన. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిరిడీ సాయి’ లాంటి ఫిల్మ్స్​కు కీరవాణి అందించిన పాటలను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. అలాంటి ఆయన ఖ్యాతి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో విశ్వవ్యాప్తమైంది. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమంతా ఆడిపాడింది.

‘నాటు నాటు’ సాంగ్​తో ఆస్కార్ సహా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కీరవాణి దక్కించుకున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘చంద్రముఖి 2’ సినిమాలకు ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. వీటిలో ‘వీరమల్లు’ షూటింగ్ నిలిచిపోయిందని సమాచారం. కానీ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ తదితరులు నటిస్తున్న ‘చంద్రముఖి 2’ చిత్రీకరణ పూర్తయింది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీలోని క్యారెక్టర్లకు ప్రాణం పోసేందుకు తాను ఎంతగానో శ్రమించాల్సి వచ్చిందని అంటున్నారు కీరవాణి. ఈ విషయాన్ని ఆయన తాజా ట్వీట్​లో వెల్లడించారు. ‘చంద్రముఖి 2’లోని పాత్రలు మరణభయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయని కీరవాణి తెలిపారు.

‘చంద్రముఖి 2’లోని మైండ్​బ్లోయింగ్ సీన్లకు తన సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలు నిద్రలేని రాత్రలు, పగళ్లు గడిపానని ఆయన చెప్పుకొచ్చారు. ‘చంద్రముఖి’, ‘నాగవల్లి’ సినిమాలకు సంగీతం అందించిన విద్యాసాగర్, గురు కిరణ్​ పేర్లను తన ట్వీట్​లో ప్రస్తావించారు కీరవాణి. తనకు జయం కలగాలని కోరుకోండి అంటూ వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్​ను బట్టి ‘చంద్రముఖి 2’ బ్యాగ్రౌండ్ స్కోర్​ కోసం కీరవాణి రెండు నెలల పాటు కష్టపడ్డారని తెలుస్తోంది. ఇకపోతే, పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ బ్లాక్ బస్టర్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్​గా రూపొందిన ‘నాగవల్లి’ మాత్రం నిరాశపరిచింది. మళ్లీ ఇన్నాళ్లకు ‘చంద్రముఖి 2’తో ఆడియెన్స్​ను పలకరించేందుకు పి.వాసు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం 2023, సెప్టెంబర్ 19న విడుదల కానుంది.