ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలను తట్టిలేపుతూ తెరకెక్కిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘బలగం’. పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరినీ కదిలించింది. ఎన్నో ప్రశంసలు.. అవార్డులు సైతం కొల్లగొట్టింది. టాలీవుడ్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాని.. దిల్ రాజు బ్యానర్ లో హర్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్స్ గా నటించారు. అయితే.. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను.. బంధాలను తెరపై ఆవిష్కరించిన తీరు అందరు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు బలగం సినిమాని కొనియాడారు.
ఈ క్రమంలో ఇటీవల వర్షాకాలం సమావేశాలలో భాగంగా.. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బలగం సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ప్రస్తుతం బలగం గురించి కేటీఆర్ మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఇటీవల మానవ సంబంధాలను చర్చిస్తూ వచ్చిన బలగం సినిమాని.. తరతరాలు గుర్తుంచుకునే విధంగా తెరకెక్కించింది మన తెలంగాణ బిడ్డ. గతంలో కాంగ్రెస్ పాలనలో కరువు, కటిక దారిద్య్రాన్ని చూపించేందుకు తెలంగాణ గ్రామాలకు వచ్చేవాళ్లు. ఇప్పుడు కేసిఆర్ పాలనలో పచ్చదనంతో, పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలని చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు.
మా తెలంగాణ బిడ్డ ఎల్దండి వేణు.. ఈ బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు రావాలని కోరితే.. ఆ ఈవెంట్ ని సిరిసిల్లలోనే జరపండని చెప్పి.. వెళ్లి రావడం జరిగింది. మా ఫ్యామిలీతో కలిసి బలగం సినిమా చూసినప్పుడు.. ఆ పచ్చదనంతో నిండిన సన్నివేశాలు తెలంగాణలోనే తీశారా? అని అడిగారు. అలాగే.. సినిమాల్లో కనిపించిన గ్రామాలను చూసి.. ఇది కోనరావుపేటనా లేక కోనసీమనా అని అడిగారు. ఇప్పుడు తెలంగాణలో కరువు సీమలన్నీ కోనసీమలుగా అభివృద్ధి అయ్యాయి” అని చెప్పుకొచ్చారు. దీంతో కేటీఆర్ స్పీచ్ బలగం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి బలగం గురించి కేటీఆర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.