భర్త ఆస్తులపై భార్యకు ఉండే హక్కు విషయంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

భర్త ఆస్తులపై భార్యకు ఉండే హక్కు విషయంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

కుటుంబం, సమాజం, వృత్తి, అవకాశం ఇలా ప్రతి విషయంలో ఆడవారికి సమాన హక్కు ఉండాలి అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఉద్యోగం, అవకాశం, నైపుణ్యంలో ఆడవాళ్లు ఇప్పటికే పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. అయితే కుటుంబం, సమాజం విషయంలో ఇంకా ఆడవారిపై వివక్ష కొనసాగుతోందనే చెప్పాలి. ముఖ్యంగా సముచిత స్థానం, ప్రాధాన్యత దక్కదు అనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అయితే వారి సామరథ్యం, స్థానం, హక్కుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సాధారణంగా పుట్టింటి ఆస్తులపై ఆడవారికి హక్కు లేదని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆడపిల్లకు కూడా సమాన హక్కు ఉంటుందని ఇప్పటికే కోర్టులు తీర్పు చెప్పాయి. అలాగే ఇప్పుడు భర్త సంపాదించిన ఆస్తులపై కూడా భార్యకు సమాన హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో భార్య భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ గుర్తించే విధంగా ఏ చట్టాన్ని రూపొందించలేదు. ఇంటి సంపాదనలో భార్య కూడా సమానంగా సహకరిస్తుంది. ఆమె చేసే పనికి విలువ లేదు అనే మాటలు అనలేం. భార్యాభర్తల సమన్వయం లేకుండా ఒక కుటుంబం నిలబడటం అసాధ్యం.

కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఒత్తిడి లేకపోతేనే భర్త సంపాదనపై దృష్టి సారించగలరని వ్యాఖ్యానించారు. అందుకు భార్య భాద్యతగా కుటుంబాన్ని నిర్వర్తించడం వల్లే.. భర్త ఆస్తులు సంపాదించగలుగుతున్నాడని చెప్పారు. అందుకే భర్త తన పేరిట సంపాదించిన అన్ని ఆస్తుల్లో భార్య కూడా సమాన హక్కుదారు అవుతుందన్నారు. ఆస్తులు భర్త పేరిట ఉన్నా కూడా వాటిపై భార్యకు సమాన హక్కు ఉంటుంది. కుటుంబం కోసం, పిల్లల కోసం భార్య ఎంత కష్టపడినా కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తమకంటూ సొంతమని ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. సంపాదనలో పత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భార్యాభర్తల భాగస్వామ్యం ఉన్నప్పుడు ఆస్తులపై కూడా సమాన హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

2002లో ఓ భర్త తన భార్యపై వేసిన కేసు విషయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను తినీ తినక విదేశాల్లో కష్టపడి సంపాదించి ఇంటిని కొంటే.. భార్య తన ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశాడు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అలాంటి వ్యక్తికి ఆస్తిలో వాటా ఎలా ఇస్తానంటూ కోర్టుకెక్కాడు. తన సహకారం లేకుండా ముగ్గురు పిల్లలను చూసుకోకుంటే.. తాను డబ్బు ఎలా సంపాదించేవారని ప్రశ్నించింది. తాను పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతోనే విదేశాలకు వెళ్లారని తెలిపింది. ఈ కేసు నడుస్తుండగానే కన్నయ్య నాయుడు మరణించారు. తన తండ్రి ఆస్తులపై సమాన హక్కు కోసం పిల్లలు కోర్టుకెళ్లారు. అయితే భార్యాభర్తల సమాన హక్కులపై భార్య దాఖలు చేసిన రెండో పిటిషన్ ని కూడా కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగానే న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Show comments