iDreamPost
iDreamPost
ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ ని ఓవర్ టేక్ చేసి మరీ దాన్ని మించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2కి కొనసాగింపు ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో ఇంకా ఉన్నాయి. క్లైమాక్స్ లో షిప్పు మునిగి రాఖీ భాయ్ చనిపోయాడన్నట్టుగా చూపించారు కానీ ఎండ్ టైటిల్స్ అయ్యాక మళ్ళీ విదేశీ అధికారులు రావడం, అక్కడో ట్విస్టు పెట్టడం వగైరా ఆసక్తి రేపాయి. అంటే మూడో భాగానికి అవకాశం ఇచ్చి వదిలేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా నిర్మాత చెబుతున్న దాని ప్రకారం కెజిఎఫ్ 3 పక్కాగా ఉంటుందట. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటామని అన్నారు.
సో రాఖీ భాయ్ ఫ్యాన్స్ మరోసారి మాన్స్ టర్ డ్రామాని చూసేందుకు రెడీ కావొచ్చు. అయితే ఇప్పుడీ సీక్వెల్ లో రాఖీ భాయ్ అమెరికా వెళ్లినట్టు చూపిస్తారా లేక సముద్రం నుంచి బయటికి వచ్చి ఇంకో చోట తలదాచుకుని మళ్ళీ తన బంగారు గనుల దగ్గరికి వస్తాడా అనేది వేచి చూడాలి. కథ ప్రకారం అధీరా చనిపోయాడు. కట్టుకున్న భార్యా కన్నుమూసింది. సో రెండు కొత్త పాత్రలను సృష్టించాలి. ప్రధానిగా నటించిన రవీనాటాండన్, రాఖీని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన రావు రమేష్ లు బ్రతికే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎక్స్ టెన్షన్ ని ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది యష్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
మరి యష్ ఇంకో రెండేళ్ల పాటు కెజిఎఫ్ 3కే అంకితమైపోతాడా లేక వేరే ఇంకేదైనా సినిమా చేస్తాడా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఓ తమిళ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వడం కానీ ఒక అంగీకారానికి రావడం కానీ జరగలేదు. ప్యాన్ ఇండియా లెవెల్ లో తనకు పెరిగిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకోవడం యష్ మీద ఒత్తిడిని పెంచుతోంది. అందుకే ప్రస్తుతానికి కెజిఎఫ్ 3 చేయడం మంచిదే. ఇప్పటిదాకా ఇండియాలో ఒకే స్టోరీ మీద థర్డ్ సీక్వెల్ తీయలేదు. బాలీవుడ్ లో ధూమ్ లాంటివి వచ్చాయి కానీ అవన్నీ వేర్వేరు కథలు. సో ఈ రకంగా కూడా ప్రశాంత్ యష్ లు అరుదైన ఘనతను అందుకుంటారు.