Idream media
Idream media
ఒక మనిషి గొప్ప వాడైతే లాభం లేదు. దానికి అదనంగా ఆస్తులుండాలి, వారసత్వం వుండాలి. కాంతారావు గొప్పవాడే. ఆస్తులు లేవు. హీరోలుగా రంగంలో ఉన్న వారసులు లేరు. మార్చి 22 వర్ధంతి. ఎవరైనా ఆయన గురించి నాలుగు మంచి మాటలు రాస్తారేమో అని పత్రికలు వెతికాను. కనపడలేదు. అన్నీ చదవలేను, చూడలేను. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకున్న వాళ్లెవరైనా వుంటే అది వాళ్ల సంస్కారం, గొప్పతనం.
కాంతారావు 400 సినిమాల్లో నటించాడు. ఎక్కువగా జానపదాలు. కత్తియుద్ధాల వీరుడు. తెలుగు పరిశ్రమకి చేసిన సేవ తక్కువేం కాదు. ఒక హీరో నిరంతరం మూడు షిప్టులు పని చేస్తే ఆయనకి మాత్రమే లాభం కాదు. ఒక సినిమా నిర్మాణంలో కనిష్టం లెక్క వేసుకున్నా 50 నుంచి 100 మందికి పని దొరుకుతుంది. జానపదాల్లో సెట్టింగులు ఉంటాయి కాబట్టి కార్పెంటర్లు, పెయింటర్లకి చేతి నిండా పని. రాజు ఆస్థానం చూపించాలంటే జూనియర్ ఆర్టిస్టులు బోలెడు మంది కావాలి.
కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు కాంతారావు సినిమాలు చూసి ఆనందించారు. చప్పట్లు కొట్టారు. చివరి రోజుల్లో ఆయన కష్టాలు పడొచ్చు. ఆస్తులు పోగొట్టుకోవచ్చు. అంతమాత్రాన కళాకారుడు కాకుండా పోతాడా? ఘనంగా గుర్తు చేసుకోవలసిన హీరో కదా!
చిన్నప్పుడు చందమామ కథలు నిజమని నమ్మేవాన్ని. దెయ్యాలు, భూతాలు ఉన్నాయని అమిత విశ్వాసం. మంత్రాలు నేర్చుకోడానికి కూడా ప్రయత్నించాను. కాకపోతే మాంత్రికులు నైటీ లాంటి దుస్తులు ఎందుకు వేసుకుంటారో తెలిసేది కాదు. మాంత్రికుడిగా మారి మా హిందీ అయ్యవారు హీరాలాల్‌ని రామచిలుకగా మార్చాలని ఆశ. హిందీ మనకి రాదు, వచ్చే వరకూ ఆయన తంతాడు.
కల్పిత అద్భుత ప్రపంచానికి మూలం. ఎక్కువగా కాంతారావు సినిమాలే. ఆయనతో సౌలభ్యం ఏమంటే లవ్ ట్రాక్ వుండదు. కృష్ణకుమారి నాలుగు సార్లు రెప్పలు కదిలిస్తే లవ్ పుడుతుంది. వెంటనే గుండెని మీటిన రాకుమారుడని పాట స్టార్ట్. నా వలపు వలరేడా అని ఆమె ఎత్తుకుంటుంది. నడుము వరకు గౌన్ వేసుకుని పిర్రెలకి అతుక్కుపోయిన టైట్ ప్యాంట్‌తో హీరో వుంటాడు. (ఆ వస్త్రధారణలో వాష్ రూమ్ వస్తే గతి ఏంటో!)
కాంతారావు సినిమాలో పెద్ద ట్విస్టులుండవు. హీరో, హీరోయిన్ గడ్డాలు మీసాలు పెంచుకున్న ఒక మాంత్రికుడు. ముక్కామల, త్యాగరాజు, రాజనాల వీళ్లలో ఒకరు ఈ వేషాల్లో రెడీగా వుంటారు. మిక్కిలినేని మహారాజు. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తుంటాడు. మాంత్రికుడికి యువరాణిపై కన్ను. మీసాలు, గడ్డాల్లో బొద్దింకలు, ఎలుకలు తిరిగే మాంత్రికున్ని యువరాణి కాదు కదా, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ప్రేమిస్తుందా? దాంతో వాడికి పగ. హీరో అడ్డు, అందుకే ఎలుగు బంటిగా మారుస్తాడు. అంజిగాడు సహాయంతో హీరోకి విముక్తి. చివర్లో ఫైట్. మాంత్రికుని సంహారం. ఇదే కథని విఠలాచార్య కాంతారావుతో 20 సార్లు తీశాడు. అయినా జనం కనుక్కోలేదు. వాళ్లకు కావాల్సింది లాజిక్ కాదు, వినోదం.
కాంతారావు కత్తి యుద్ధంలో ఎంత స్పెషలిస్ట్ అంటే ఆయనకి కత్తి కాంతారావు అనే పేరు స్థిర పడిపోయింది. హీరోగానే కాదు, ఏ వేషమైనా న్యాయం చేసేవాడు. లవకుశలో లక్ష్మణున్ని, దేవుడు చేసిన మనుషులలో విలన్‌ని, ముత్యాలముగ్గులో తండ్రిని మరిచిపోగలమా?
రెక్కలొస్తే ఆకాశంలో ఎగరచ్చని, కష్టాలొస్తే శివపార్వతులు కనిపించి ఆదుకుంటారని , మంత్రశక్తులుంటే హోంవర్క్ పీడ వదులుతుందని , రొమ్ము విరుచుకుని తిరిగే రౌడీ రుద్రున్ని చితకబాదొచ్చని, మంచి దెయ్యాలు కనిపించి భూమిలోపల నిధిని ఇచ్చి పంపుతాయని , అదృష్ట శక్తులుంటే టికెట్ లేకుండా సినిమా చూడొచ్చని నమ్మే అమాయకపు బాల్య లోకం ఒకప్పుడు వుండేది. అందరికి వుంటుంది కూడా. ఆ లోకాన్ని కళ్ల ముందు చూపించి, కల్పనాశక్తిని పదింతలు చేసి యోగుల హృదయాల్లో జ్వలించే ఆత్మానందాన్ని నా లాంటి పసివాడికి కలిగించిన కాంతారావు నీవెప్పటికీ గుర్తుంటావు.
వర్తమానం సంక్లిష్టంగా ఉన్నప్పుడు ప్రతి మనిషి బాల్యంలోకి పారిపోతాడు. చీకటి గుహల్లో పారిపోతున్నప్పుడు ఒక మాంత్రికుడితో కత్తి యుద్ధం చేస్తున్న కాంతారావు కనపడతాడు.
ముఖం మీద వస్తున్న ముడుతలు , లోపలున్న రెక్కల గుర్రాన్ని ఆపలేవు.
– GR Maharshi