పండగ వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ప్రేక్షకుల ఈలలు, గోలలతో బిగ్ స్క్రీన్స్ అన్నీ కళకళలాడుతాయి. దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగలతో పాటు మిగతా ఫెస్టివల్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి కీలకమే. పండుగతో పాటు లాంగ్ వీకెండ్ ఉంటే రిలీజ్‌కు చిత్రాలు క్యూ కడతాయి. దీంతో మూవీస్‌కు కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి. పండుగ సమయాల్లో విడుదలైతే కంటెంట్ యావరేజీగా ఉన్నా ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సినిమాలు పోటీపడతాయి. చాలా సమయాల్లో ఇది వర్కవుట్ అయింది. పండక్కి వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్‌తోనూ హిట్ కొట్టాయి.
యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా పండక్కి థియేటర్లకు వస్తారు. కాబట్టి మూవీ మోస్తరుగా ఉన్నా నడిచిపోతుంది. అందుకే పండుగలకు చాలా సినిమాలు కాస్త ముందగానే కర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఈసారి టాలీవుడ్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ నాడు ఒక్క తెలుగు మూవీ కూడా రిలీజ్ కావడం లేదు. గణేష్ పండుగతో పాటు కలసిరానున్న లాంగ్ వీకెండ్ కోసం ఒక్కటంటే ఒక్క తెలుగు మూవీ కూడా విడుదల కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి ఈ గణేష్ చతుర్థికి చాలా చిత్రాలు విడుదల కావాల్సింది.
వినాయక చవితికి వస్తున్నామంటూ కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న చిత్రాలు వెనక్కి తగ్గాయి. కానీ ఆఖరి నిమిషంలో బడా మూవీస్ చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబోలో రూపొందిన ‘స్కంద’ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ మూవీ సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. ప్రభాస్ ‘సలార్’ పోస్ట్‌పోన్ కావడంతో ‘స్కంద’ను 28వ తేదీకి వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. ఇక, రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కలసి నటించిన ‘చంద్రముఖి 2’ కూడా సెప్టెంబర్ 15నే రావాల్సింది. కానీ ఈ మూవీ కూడా సెప్టెంబర్ 28కి పోస్ట్‌పోన్ అయింది. అంటే 28న ‘స్కంద’, ‘చంద్రముఖి 2’ బాక్సాఫీస్ వద్ద పోటీపడతాయి.
వినాయక చవితికి ‘టిల్లు స్క్వేర్’ మూవీతో సిద్ధు జొన్నలగడ్డ సందడి చేస్తాడని అందరూ అనుకున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వకపోవడంతో ‘టిల్లు స్క్వేర్’ను వాయిదా వేశారు. గణేష్ చతుర్థికి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడం లేదు. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఒక డబ్బింగ్ సినిమానే దిక్కు కానుంది. అదే ‘మార్క్ ఆంటోని’. యాక్షన్ స్టార్ విశాల్ నటిస్తున్న తమిళ చిత్రం ఇది. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ‘మార్క్ ఆంటోని’కి కాసుల పంట పండినట్లేనని ట్రేడ్ పండితులు అంటున్నారు.