iDreamPost
iDreamPost
బాలీవుడ్ కండల వీరుడు తెలుగు పాటకు స్టెప్పు వేయడం ఏమిటనుకుంటున్నారా. నిజమేనండోయ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటోంది. విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ వీలైతే దసరా రేస్ లో ఉంచే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్ ప్రత్యేక క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ఇది. కొద్దిపాటి మార్పులతో ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ పాత్ర ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
మరో ఎగ్జైటింగ్ అనిపించే విషయం ఏంటంటే ఇందులో సల్మాన్ ఖాన్ చిరంజీవి కలిసి ఓ పాటకు డాన్సు చేయబోతున్నారట. తమన్ స్వరపరిచిన ఓ రాకింగ్ ట్యూన్ కి జానీ మాస్టర్ కంపోజ్ చేయబోయే స్టెప్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని వినికిడి. ఇద్దరి వయసులు దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగానే విజిల్స్ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో నృత్యరీతులు ఉండబోతున్నాయని తెలిసింది. దీని కోసమే పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తో పాడించాలని తమన్ చాలా ట్రై చేశాడు. అందులో సఫలీకృతమయ్యాడో లేదో తెలియదు కానీ మొత్తానికి ఫైనల్ రికార్డింగ్ పూర్తి చేశారట. దీని చిత్రీకరణ ఈ నెలలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి.
సో స్క్రీన్ మీద మొదటిసారి బాలీవుడ్ టాలీవుడ్ మెగాస్టార్ లు కలిసి చిందులు వేసే అరుదైన దృశ్యాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లూసిఫర్ లో ఇది ఐటెం సాంగ్. మోహన్ లాల్ ప్రత్యేకంగా కాలు కదపడం ఉండదు. కానీ అలా తీస్తే ఇక్కడ ఒప్పుకోరు కాబట్టి మోహన్ రాజా ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. చిరంజీవి సరసన జోడి కాకపోయినా నయనతార ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుండగా సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర తారాగణం. హనుమాన్ జంక్షన్ తర్వాత పూర్తిగా తమిళంకే అంకితమైపోయిన మోహన్ రాజా ఇప్పుడీ గాడ్ ఫాదర్ తో బలమైన కం బ్యాక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు. హిట్టు కొడితే స్టార్ హీరోలు క్యూ కట్టడం ఖాయం
Also Read : RRR : 900 కోట్లతో రామ్ భీమ్ ల సంచలనం