iDreamPost
iDreamPost
సినిమా తీయడం, హిట్టు కొట్టడం, కోట్ల రూపాయల వసూళ్లు చేసుకోవడం ఎంత కీలకమో దాన్ని పైరసీ బారిన పడకుండా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు కానీ పరిశ్రమ వర్గాలు కానీ దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోలేకపోయాయి. వచ్చే మార్గం మారిందే తప్ప ప్రతి కొత్త మూవీ విడుదల కావడం ఆలస్యం సాయంత్రానికి దాని కెమెరా ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. సరే ఇది ఎవరూ కట్టడి చెయ్యలేని వ్యవహారం సినిమా బాగుంటే జనం వాళ్ళే వస్తారనే నమ్మకంతో నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడిది రిలీజైన వాటికి కూడా కొత్త రకం తలనెప్పిని తెప్పిస్తోంది.
నిన్న ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తాలూకు హెచ్డి ప్రింట్లు కొన్ని పైరసీ సైట్లలో వచ్చేయడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాలకు ఇలా జరగడం ఏమిటని టెన్షన్ పడ్డారు. కానీ అవి తమిళ వెర్షన్ తాలూకు కాపీలు కావడం కొంత ఊరట కలిగించింది. అయినా కూడా ఇది ఉపేక్షించేది కాదు. బాధ్యులు ఎవరో కనిపెట్టాలి. ఇంకా ఓటిటి ప్రీమియర్లు కన్ఫర్మ్ కాకముందే ఇలా చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. అందులోనూ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లకు తమిళ్ లో మంచి రన్ దక్కింది. ఇప్పటికీ ఆడుతున్నాయి. దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమాన పడుతున్న ఫ్యాన్స్ లేకపోలేదు.
వెంటనే అలెర్ట్ అయిపోయిన టీమ్స్ బాగానే కట్టడి చేయగలిగాయి కానీ ఈలోగా కొంత నష్టమైతే జరిగిపోయింది. ముఖ్యంగా టెలిగ్రామ్ లాంటి యాప్స్ కు ఈ పైరసీ కాపీలు అడ్డాగా మారిపోయాయి. కేవలం వెబ్ సైట్స్ మీద దృష్టి పెట్టిన సైబర్ సెల్స్ వీటిని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. సరే సినిమా రన్ పూర్తవ్వడానికి దగ్గరగా ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రెండో వారంలోనో పది రోజుల్లోనో వచ్చేసుంటే అప్పుడు ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్ఆర్ఆర్ పే పర్ వ్యూ మోడల్ లో జీ5 ద్వారా మే 20, కెజిఎఫ్ మే 27 డిజిటల్ ప్రీమియర్ జరగొచ్చని టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది