మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త చిత్రం ‘భోళా శంకర్’. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరుకు జోడీగా తమన్నా యాక్ట్ చేశారు. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ హీరో సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ శుక్రవారం (ఆగస్టు 11) నాడు రిలీజైన ‘భోళా శంకర్’కు మార్నింగ్ షో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈవెనింగ్ అయ్యేసరికి అది కాస్తా నెగెటివ్ టాక్‌గా మారింది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో ఫస్ట్ డే ఆశించినంతగా వసూళ్లు రాలేదు.
భారీ ఎత్తున రిలీజైన మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.28 కోట్ల గ్రాస్ (రూ.18.61 కోట్ల షేర్) కలెక్షన్స్‌ను రాబట్టిందని ట్రేడ్ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.15.51 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్‌లో రూ.2 కోట్లు, ఈస్ట్‌లో రూ.1.50 కోట్లు, వెస్ట్‌లో రూ.1.85 కోట్లు, గుంటూరులో రూ.2.07 కోట్లు, కృష్ణాలో రూ.1.02 కోట్లు, నెల్లూరులో రూ.73 లక్షలు.. కర్ణాటక, ఓవర్సీస్లో కలుపుకొని చిరంజీవి మూవీ రూ.3.1 కోట్లు వసూలు చేసిందని తెలిసింది.
‘భోళా శంకర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద టార్గెట్ పెట్టుకునే రంగంలోకి దిగాడు. ఈ చిత్రానికి సుమారుగా రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఆ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే కనీసం రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. అయితే ఫస్ట్ డేనే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లు రాబట్టడం కష్టమేనని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తలైవా రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ ఫిల్మ్ ఎఫెక్ట్ కూడా ‘భోళా’పై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మూవీ హిట్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.