iDreamPost
android-app
ios-app

Jayamma Panchayathi థియేటర్లలో సుమ – నిజంగా సీనుందా

  • Published Apr 21, 2022 | 4:04 PM Updated Updated Apr 21, 2022 | 4:04 PM
Jayamma Panchayathi థియేటర్లలో సుమ – నిజంగా సీనుందా

వచ్చే నెల 6న విడుదల కాబోతున్న జయమ్మ పంచాయితీలో సుమ టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడంతో జనం గట్టిగానే చూశారు. అయితే ఈ కారణంగా ఓపెనింగ్స్ వస్తాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే యాంకర్ గా ఎంత గొప్ప పేరున్నా సుమ తెరమీద కనిపించి చాలా కాలం అయ్యింది. ఎప్పుడో దాసరిగారు కళ్యాణ ప్రాప్తిరస్తులో హీరోయిన్ గా లాంచ్ చేశాక అడపాదడపా కొన్ని సినిమాలు చేసి తర్వాత పూర్తిగా బుల్లితెరకే అంకితమైపోయారు. టాలీవుడ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు సుమారు తొంభై శాతానికి పైగా సుమనే వ్యాఖ్యాతగా ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాం

ఇప్పుడీ పాపులారిటీ థియేటర్ల దాకా జనాన్ని తీసుకొస్తుందా అంటే అనుమానమే. అసలే చాలా రిస్క్ లో సుమ మూవీని హాళ్లలో తీసుకొస్తున్నారు. అప్పటికి ఆచార్య వచ్చి కేవలం వారమే అయ్యుంటుంది. టాక్ తో సంబంధం లేకుండా కనీసం పది రోజులు దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. ఒకవేళ హిట్ అయితే మాత్రం జయమ్మ పోస్టు పోన్ చేసుకోవడం ఉత్తమం. ఇది చాలదన్నట్టు మే 6నే విశ్వక్సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఒకవేళ కుటుంబ ప్రేక్షకులు రెండింటిలో ఒకటే ఛాయస్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఓటు విశ్వక్ కే పడుతుంది.

ఆపై వారం గ్యాప్ లో మహేష్ బాబు తన సర్కారు వారి పాటతో విరుచుకుపడతాడు. మరి జయమ్మ పంచాయితీకి వారమే ఎక్కువ అనుకున్నారో ఏమో మరి. ఏది ఏమైనా కరోనా తర్వాత ట్రెండ్ లో చాలా మార్పులు వచ్చాయి. జనం అంత ఈజీగా మునుపటిలా కొత్త సినిమా రాగానే థియేటర్లకు పరిగెత్తడం లేదు. ఆచితూచి వెళ్తున్నారు. టాక్ రివ్యూలు చెక్ చేసుకుంటున్నారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప కాలు బయట పెట్టడం లేదు. అలాంటప్పుడు జయమ్మ పంచాయితీ లాంటి సినిమాలకు ఇదంతా ఒక సవాల్ లాంటిదే. విజయ్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.