ఫిలిం ఇండస్ట్రీలో ఏటా చాలా మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే పరిశ్రమలో చాన్నాళ్లు కొనసాగుతారు. హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకునేందుకు అందం, కాస్త నటన వచ్చి ఉంటే సరిపోతుంది. కానీ కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే మాత్రం నిరంతరం తమను తాము మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అందాన్ని కాపాడుకుంటూనే నటనలోనూ బెస్ట్ అనిపించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పోటీని తట్టుకొని నిలబడగలరు. ఈమధ్య కాలంలో సౌత్‌లో చూసుకుంటే తమన్నా, త్రిష, సమంత, నయనతార లాంటి హీరోయిన్స్ దీన్నే అవలంబించారు.
నయనతార, త్రిష, తమన్నా, సమంత లాంటి హీరోయిన్లు తమ ఫిజిక్‌ను కాపాడకుంటూనే నటనలో మరింత మెరుగుపడ్డారు. అందుకే కుర్ర హీరోయిన్లకు ధీటుగా రాణిస్తున్నారు. ఒకవైపు సీనియర్ హీరోలతో యాక్ట్ చేస్తూనే.. మరోవైపు యువ కథనాయకుల పక్కన కూడా ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఈ హీరోయిన్లు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. కానీ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తోనే కెరీర్‌ను నిర్మించుకున్న అరుదైన కథానాయికగా కోలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాజేష్‌ను చెప్పుకోవచ్చు. ఈమె మన తెలుగమ్మాయే. ఐశ్వర్య తండ్రి రాజేష్ గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించి తెలుగువారికీ దగ్గరయ్యారామె.
ఎక్కువగా తమిళ చిత్రాల్లో, అందులోనూ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కే ఐశ్వర్య రాజేష్‌ను మేకర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. కెరీర్లో తాను ఫేస్ చేస్తున్న ఈ పరిస్థితి గురించి ఐశ్వర్య వివరిస్తూ.. స్టార్ డైరెక్టర్స్, హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ మంది ఉన్నారని.. అందువల్లే ఎక్కువ ఛాన్సులు రావట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు. చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు తన యాక్టింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటారని.. కానీ వారి ప్రాజెక్టుల్లో మాత్రం తనను తీసుకోరన్నారు ఐశ్వర్య. వాళ్ల గొప్పలన్నీ పొగడటం వరకేనని.. అవకాశాలు ఇవ్వరన్నారు. చిన్న బడ్జెట్, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.