iDreamPost
android-app
ios-app

5 బాషల పాన్‌ ఇండియా – కరెక్టేనా?

  • Published Apr 18, 2022 | 7:13 PM Updated Updated Apr 18, 2022 | 7:15 PM
5 బాషల పాన్‌ ఇండియా – కరెక్టేనా?

ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ కు ఊతపదంలా మారిపోయింది ప్యాన్ ఇండియా. ప్రకటన స్టేజి నుంచే తాము వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నామని ప్రకటించేసి సినిమాకు క్రేజ్ తెచ్చే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నిజానికి వివిధ భాషల్లో డబ్బింగ్ చేసినంత మాత్రం దేనికీ అమాంతం క్రేజ్ పెరిగిపోదు. దానికి ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిన్న నిఖిల్ కొత్త మూవీ స్పైని ఏకంగా హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడలో రిలీజ్ ఉంటుందని ప్రకటించి షాక్ ఇచ్చారు. నిఖిల్ కు అంత ఇమేజ్ కానీ మార్కెట్ కానీ లేదు. కేవలం బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసిన యాక్షన్ థ్రిల్లర్ అనే కారణంలో ఇలా చేసుండొచ్చు.

నాని అంటే సుందరానికి తమిళం మళయాలంలో రెడీ చేశారు. ఎందుకనో మరి కన్నడ హిందీ వదిలేశారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్ 2లను నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించిన మాట వాస్తవమే. అలా అని మన ప్రతి సినిమాను ఎగబడి చూస్తారన్న గ్యారంటీ లేదు. కంటెంట్ ముఖ్యం. దానితో పాటు స్టార్ ఇమేజ్ కీలకం. పైన చెప్పిన మూడు సినిమాల్లో ఇవి కీలకంగా పని చేశాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 విజువల్స్ కి జనం ఫిదా అయ్యారు. అంతే తప్ప మల్టీ లాంగ్వేజ్ లో రావడం గొప్పేమి కాదు. అందులోనూ గ్రాండియర్ అప్పీల్ లేని మాములు డబ్బింగ్ సినిమాల పట్ల హిందీ ఆడియన్స్ థియేటర్ లో చూసేందుకు అంత ఆసక్తి చూపించరు.

ప్యాన్ ఇండియా పదానికి అర్థం ప్రెజెన్స్ అక్రాస్ నేషన్. అంటే దేశవ్యాప్తంగా సినిమా ఏ మూలకెళ్లినా ఉంటుందనే ఉద్దేశం. కానీ నిఖిల్ నాని నితిన్ లాంటి హీరోలకు అంత రీచ్ లేదు. కేవలం బిజినెస్ లెక్కల కోసమో లేక సోషల్ మీడియాలో మార్కెటింగ్ హైప్ తీసుకురావడానికో పదే పదే ప్యాన్ ఇండియా అనడం రాబోయే రోజుల్లో దానికున్న విలువను తగ్గించినా ఆశ్చర్యం లేదు. మనం బాగుందన్న శ్యామ్ సింగ రాయ్ హిందీలో చూడలేదు. రవితేజ ఖిలాడీకి కనీస స్పందన రాలేదు. పట్టుమని అయిదారు కోట్ల మార్కెట్ లేని హీరోలు తాము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నామని చెప్పుకోవడం చూస్తే ప్యాన్ వరల్డ్, ప్యాన్ యునివర్స్ లు త్వరలోనే రావొచ్చు