Saudi Man Weight Loss Journey: రాజు గారి ఆదేశాలు.. 610 కేజీల నుంచి 63 కిలోలకు తగ్గాడు!

Weight Loss: రాజు గారి ఆదేశాలు.. 610 కేజీల నుంచి 63 కిలోలకు తగ్గాడు!

Saudi Man Weight Loss Journey: ప్రపంచంలోనే అత్యంత బరువైన ఓ వ్యక్తి.. ఏకంగా 500 కిలోలకు పైగా బరువు తగ్గాడు. ఆ వివరాలు..

Saudi Man Weight Loss Journey: ప్రపంచంలోనే అత్యంత బరువైన ఓ వ్యక్తి.. ఏకంగా 500 కిలోలకు పైగా బరువు తగ్గాడు. ఆ వివరాలు..

ప్రపంచంలో అధిక మందిని వేధిస్తోన్న సమస్య.. ఊబకాయం. మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా.. చాలా మంది ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ బరువు పెరుగుతున్నారు. ఇక వెయిట్ పెరగడం ఎంత సులభమో.. తగ్గడం అంత కష్టం. మార్కెట్ లో అధిక బరువు తగ్గించే ప్రక్రియలు, సర్జరీలు, మందులు ఎన్నో వచ్చాయి. వీటికి ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది. అయితే వీటిని పాటించకుండా.. సహజ పద్దతిలో బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది అంటారు. అయితే కొందరు భారీ ఎత్తున బరువు పెరుగుతారు. అలాంటి వారు కనీసం కూర్చలేరు.. పడుకోలేరు.. నడవలేరు. వారు బరువు తగ్గాలంటే సర్జరీలే శరణ్యం. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన ఓ వ్యక్తి అనూహ్యంగా 500 కేజీలకు పైగా బరువు తగ్గి.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ వివరాలు..

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని మన దగ్గర ఓ సామెత ఉంది. ఇక రాజు గారి ఆదేశాల మేరకు.. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తి.. సన్నబడి నాజూకుగా మారిపోయాడు. ఒకప్పుడు 600 కిలోలకుపైగా బరువున్న అతడు.. ఇప్పుడు ఏకంగా 63 కేజీలకు తగ్గాడు. అతడే సౌదీకి చెందిన ఖలీద్‌ బిన్ మొహసెన్ షారీ. అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులు పడిన ఖలీద్ బరువు 2013 నాటికి 610 కేజీలకు చేరింది. దీంతో అతడు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.

అధిక బరువు కారణంగా ఖలీద్ మరణానికి చేరువయ్యాడు. అతడి దీన గాధ విన్న సౌదీ మాజీ రాజు అబ్దుల్లా మానవత్వంతో స్పందించారు. అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్న రాజు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాజకుటుంబ ఆదేశంతో ఖలీద్‌కు చికిత్స ప్రారంభమైంది. అతడి కోసం ప్రత్యేకంగా ఒక పరుపును డిజైన్‌ చేయించి.. ఫోర్క్‌లిఫ్ట్ సాయంతో ఓ వాహనంలో ఖలీద్‌ను ఎక్కించి రియాద్‌లోని కింగ్‌ ఫహద్‌ మెడికల్‌ సిటీకి తరలించారు. 30 మంది వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు ఖలీద్‌ను పర్యవేక్షించింది. ప్రత్యేక డైట్‌ఛార్ట్‌ రూపొందించి.. అతడికి గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ చేశారు.

ఖలీద్ బరువును తగ్గించడంతో పాటు అతడి శరీరంలోని కదలికల పునరుద్ధరణకు వ్యాయామాలు, ఫిజియోథెరపీ చేయించారు. ఈ ప్రక్రియలో మిడిల్ ఈస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తల సహకారం తీసుకున్నారు. వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలా ఖలీద్ బరువు తగ్గుతూ 2023 నాటికి ఏకంగా దాదాపు 550 కిలోలు తగ్గి.. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. వెయిట్ లాస్ తర్వాత.. అతడి శరీరంపై ఉన్న అదనపు చర్మం తొలగింపు కోసం బెరియాట్రిక్ సర్జరీలు నిర్వహించారు. అవి కూడా విజయవంతంగా పూర్తి కావడంతో.. ప్రస్తుతం ఖలీద్ చాలా సన్నగా మారిపోయాడు.

ప్రస్తుతం ఖలీద్ బరువు 63.5 కిలోలుగా ఉంది.  ఇప్పుడందరూ అతడిని ‘స్మైలింగ్‌ మ్యాన్‌’ అంటున్నారు. ఖలీద్ రూపం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకప్పుడు కదలలేకుండా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు చీపురు పుల్ల మాదిరిగా కనిపించేసరికి నమ్మలేకపోతున్నారు. అతడి ప్రాణాలు కాపాడిన రాజు మంచి మనసను ప్రశంసిస్తున్నారు.
Show comments