iDreamPost
android-app
ios-app

స్పెయిన్ ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. వేల ఇళ్లు బుగ్గిపాలు!

స్పెయిన్ ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. వేల ఇళ్లు బుగ్గిపాలు!

కార్చిచ్చు స్పెయిన్ దేశాన్ని కలవరపెడుతోంది. శనివారం మొదలైన మంటలు ఇంకా ఆరలేదు. ఇప్పటికే వేల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వేల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల.. స్పెయిన్ కానరీ దీవుల్లోని లా పాల్మా కొండపై ఈ కార్చిచ్చు మొదలైంది. ఈ దీవుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ అగ్ని కీలలు ఇప్పటికే 11,500 ఎకరాల అడవిని మింగేశాయి. 3000 ఇళ్లు దగ్ధమయ్యాయి. 4000 మంది వరకు ఆశ్రయం కోల్పోయారు. చాలా మంది వచ్చేందుకు అంగీకరించకపోతుంటే.. బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి పరిస్థితులు సద్దుమణిగే వరకు ద్వీపంలోని వాయువ్య ప్రాంతానికి ఎవరూ వెళ్లొద్దంటూ సూచించారు. అటవీప్రాంత వాసులంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆ దీవుల అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మంటల కారణంగా అరటి తోటలు తగలబడిపోతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు దగ్ధమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ మంటల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ప్రజలు మాత్రం ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలు, కష్టపడి కట్టుకున్న ఇళ్లు అన్నీ బుగ్గిపాలవుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, 400 మంది సైనికులు కఠోరంగా శ్రమిస్తున్నారు. నీళ్లు జల్లే విమానాలు, 10 హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలు ఎప్పుడు ఆరుతాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 2021లో స్పెయిన్ లో అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు 3 నెలలు పాటు కొనసాగాయి. ఆ అగ్నికీలల వల్ల బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది.