రెండు రోజుల్లోనే ఇంటిని నిర్మించేస్తుంది.. ఈ టెక్నాలజీకి మైండ్ బ్లాకే..

Hadrian X Robotic Constructions: మామూలుగా ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది.. ఒక ఆరు నెలలు.. లేదా ఏడాది. దీని కోసం మేస్త్రి, కూలీలు కావాలి. అయితే ఇవేమీ అవసరం లేకుండా రెండే రెండు రోజుల్లో ఇల్లు పూర్తి చేసే కొత్త టెక్నాలజీ ప్రస్తుతం వచ్చేసింది.

Hadrian X Robotic Constructions: మామూలుగా ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది.. ఒక ఆరు నెలలు.. లేదా ఏడాది. దీని కోసం మేస్త్రి, కూలీలు కావాలి. అయితే ఇవేమీ అవసరం లేకుండా రెండే రెండు రోజుల్లో ఇల్లు పూర్తి చేసే కొత్త టెక్నాలజీ ప్రస్తుతం వచ్చేసింది.

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. అంటే ఇల్లు కట్టడం అనేది పెద్ద పని. చేతిలో డబ్బులున్నా గానీ ఇల్లు కట్టాలంటే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఈలోపు అద్దె ఇళ్లలో ఉండాల్సిందే. దీని వల్ల ఎంత అద్దె వేస్ట్ అవుతుందో. పైగా కార్మికుల శ్రమతో కూడుకున్న పని. కార్మికుల కొరత ఉంటే ఇక అంతే సంగతులు. ఏడాది అనుకున్న సమయం కాస్తా రెండేళ్లకి పెరుగుతుంది. మరి ఇంత కాలం ఆగలేకనేమో ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీతో రెండే రెండు రోజుల్లో ఇల్లు పూర్తైపోతుంది. ఒకరోజులు ఇంటికి సంబందించిన గోడలను కట్టేసి.. ఆ తర్వాత మిగతా పనిని మరుసటి రోజులో పూర్తి చేస్తుంది. అంటే కేవలం రెండు రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భలే ఉంది. ఎక్కడ అమలు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?   

ఎఫ్బీఆర్ అనే రోబోటిక్స్ కంపెనీ హ్యాడ్రియాన్ ఎక్స్ పేరుతో ఒక ట్రక్కును తయారు చేసింది. ఇది ఒక ఇంటిని రెండు రోజుల్లో నిర్మించగలుగుతుంది. గత ఏడాది అమెరికా స్టైల్లో గంటకు 500 ఇటుకలను పేర్చి ఇంటిని నిర్మించింది. దీన్ని అమెరికాలో అతి పెద్ద కాంక్రీట్ బ్లాక్ సప్లై కంపెనీల్లో ఒకటైన సీఆర్హెచ్పీఎల్సీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎఫ్బీఆర్, సీఆర్హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ కంపెనీలు సంయుక్తంగా ఆస్ట్రేలియా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి తీసుకొచ్చాయి. ఇది 105 అడుగుల ఎత్తు ఉంటుంది. టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన అతి పెద్ద రోబోటిక్ ట్రక్ ఇది. భారీ సంఖ్యలో ఇటుకలను ప్యాలెట్ లో పెట్టి ట్రక్ లో లోడ్ చేస్తే.. దాని కన్ స్ట్రక్షన్ ఆర్మ్ భవన నిర్మాణ పనిని మొదలుపెడుతుంది. ప్యాలెట్ లోంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది.

అక్కడ సిమెంట్ లాంటి క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఈ క్విక్ డ్రై మిశ్రమం ఒక్కో ఇటుకకు అంటుకుని ఉంటుంది. ఒక్కో ఇటుకను రోబో ఆర్మ్ వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రోబోటిక్ ఆర్మ్ పొడవు ఎక్కువగా ఉండడం వల్ల మూడు అంతస్తుల భవనాన్ని కూడా అలవోకగా నిర్మించగలదు. పైగా పనిలో గానీ, బిల్డింగ్ మెటీరియల్ విషయంలో గానీ వేస్ట్ అనేది జరగదు. దీన్ని 3డీ క్యాడ్ మోడల్ ద్వారా కంప్యూటర్ లో ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేస్తే.. అచ్చం దానిలానే ఈ రోబోటిక్ ట్రక్ నిర్మించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లో ఒక ఫెసిలిటీలో సైట్ యాక్సెప్టెన్స్ టెస్టులో భాగంగా బిల్డింగ్ ని నిర్మించాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే కనుక 5 నుంచి 10 అంతస్తుల భవనాలను నిర్మించేందుకు హ్యాడ్రియాన్ ఎక్స్ కి అనుమతి వస్తుంది.

ఈ రోబోలతో అమెరికాలో తొలిసారిగా ఇళ్లను నిర్మించేందుకు 300 హ్యాడ్రియాన్ ఎక్స్ రోబోలను తీసుకొచ్చారు. ఒక్కో హ్యాడ్రియాన్ ఎక్స్ రోబో విలువ 2 మిలియన్ డాలర్స్. అంటే మన కరెన్సీ ప్రకారం 16 కోట్ల 73 లక్షల 80 వేలు. దీన్ని బట్టి ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఈ టెక్నాలజీని భారత్ సహా ఇతర దేశాలకు కూడా వస్తుందా? లేదా? లేదంటే ఇంతకంటే తక్కువ ధరకు మనవాళ్ళు ఇళ్లను నిర్మించే టెక్నాలజీని తీసుకొస్తారా? అనేది చూడాలి. 

Show comments