Dharani
Dharani
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తానంటూ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే అనేక కేసులు ట్రంప్‌ను చుట్టు ముట్టాయి. దాంతో ఆయన 2024 అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశంపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కుమారుడు.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్‌గా మారింది. అసలు ట్రంప్ చనిపోవడం ఏంటి.. ఏం జరిగింది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటి అంటే..
డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్‌లో సెప్టెంబరు 20 బుధవారం ఉదయం 8.25 గంటల సమయంలో ఒక పోస్ట్ కనిపించింది. అంతే క్షణాల వ్యవధిలో అది వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ట్వీట్‌లో ఏం ఉంది అంటే.. తన తండ్రి అయినా డోనాల్డ్ ట్రంప్ చనిపోయాడని చెప్పడానికి తాను చాలా చింతిస్తున్నానని ఆయన కుమారుడు చెప్పుకొచ్చారు. తన తండ్రి ట్రంప్ చనిపోవడంతో.. వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ట్వీట్ డొనాల్డ్ ట్రంప్ కుమారుడి ఖాతా నుంచి రావడంతో చాలా మంది నెటిజన్లు నిజం అని నమ్మేశారు. ట్రంప్ ఎలా మృతి చెందారు అనే దాని గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. ఆ తర్వాత కూడా అదే ట్విటర్ అకౌంట్‌లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తిడుతూ మరిన్ని పోస్టులు పెట్టడంతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించారు.
దీంతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అకౌంట్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఆయన టెక్నికల్ సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే ఆ ట్విటర్ అకౌంట్‌ను సెట్ చేశారు. హ్యాకర్లు పెట్టిన పోస్టులు మొత్తాన్ని డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ట్వీట్లన్నీ స్క్రీన్ షాట్లు తీసి నెటిజన్లు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్లు ఎవరు చేశారన్నది మాత్రం ఇంతవరకు కనిపెట్టలేదు.
ఇదిలా ఉండగానే సోషల్ మీడియాలో తాను మరణించినట్లు వస్తున్న వార్తలు, ట్వీట్లు, ప్రచారం కాస్త ట్రంప్ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్ నుంచి పోస్టులు వచ్చిన అర్థగంట తర్వాత.. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దాంతో.. ఇదంతా హ్యాకర్ల పని అని తెలిసి నెటిజనులు ఊపిరి పీల్చుకున్నారు.