ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే అనుక్షణం అప్రమత్తత తప్పనిసరి. కానీ కొన్నిసార్లు ఎంత అప్రమత్తతతో ఉన్నా వాటిని జరగకుండా నివారించలేం. ఇక, ఇటీవల అగ్ని ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. అగ్ని ప్రమాద వార్తలను ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఫైర్ యాక్సిడెంట్లకు నిర్లక్ష్యం, సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి కొన్ని ప్రమాదాల వల్ల తీవ్ర స్థాయిలో ధన, ప్రాణ నష్టం కలుగుతోంది.
నెదర్లాండ్స్లో తాజాగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం రూ.కోట్లలో నష్టాలను మిగిల్చింది. ఆ దేశంలోని ఓ సరుకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అట్లాంటిక్ సముద్ర భాగంలో దాదాపుగా 3 వేల కార్లతో వెళ్తున్న ఒక నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత ఎక్కువవడంతో భయాందోళనకు గురైన సిబ్బంది.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిలో కొందరు సముద్రంలో దూకినట్లు సమాచారం. నౌక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. సిబ్బందిని వాళ్లు బయటకు తీసుకొచ్చారు.
జర్మనీ దేశంలోని బ్రెమెన్ పోర్టు నుంచి ఈజిప్టులోని మరో పోర్టుకు ఫ్రెమాంటిల్ హైవే నౌక దాదాపుగా మూడు వేల కార్లతో బయలుదేరింది. అందులో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయట. అయితే అమేలాండ్ ద్వీపానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉండగా అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సిబ్బందిలో కొందరు సముద్రంలోకి దూకేశారని సమాచారం. రెస్క్యూ టీమ్ హెలికాప్టర్లు, బోట్ల సాయంతో అక్కడికి చేరుకొని.. వారందరినీ బయటకు తీసుకొచ్చారు. అయితే నౌక ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ షిప్ పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న కార్లన్నీ దగ్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. నౌక మునగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.