Venkateswarlu
Venkateswarlu
రక్షా బంధన్ అంటే దేశంలో నూటికి 99 శాతం మందికి సోదర-సోదరీమణుల పండుగ అని మాత్రమే తెలుసు. కానీ, రక్షా బంధన్ అనేది కేవలం అక్కా-తమ్ముడు.. అన్నా-చెల్లెళ్ల మధ్య బంధానికి సంబంధించినది మాత్రమే కాదు. భార్యా, భర్త.. తండ్రీ కూతురు, తల్లీ- కుమారుడు ఇలా ఈ పండగ పరిధి చాలా విస్తృతమైనది. రక్షా బంధన్ ఉద్ధేశం.. ‘‘ మేము మీకు అన్నింటా తోడుంటాము.. మీకు కడుతున్న ఈ తాడే మీకు శ్రీరామ రక్ష’ అని ఆడవాళ్లు.. మగాళ్లకు చెప్పటం.
అసలు రాఖీ అంటే ఏమిటి?
రాఖీ అనేది ఓ రక్షణ తాడు. రక్షణగా ఉన్నాం అని చెప్పేదానికి చిహ్నంగా ఈ తాడును కడతారు. ఆడవాళ్లు.. మగాళ్లకు రాఖీ కడుతూ ఉంటారు. ఇక్కడ రక్షణ టూ వే ప్రాసెస్ లాంటిది. ఆడవాళ్లు.. మగాళ్లు బాగుండాలని కోరుకుంటూ రాఖీ కడితే.. మగాళ్లు రాఖీ కట్టిన ఆడవాళ్లకు రక్షణ కల్పిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు. రక్షా బంధన్‌కు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల్లో కూడా రక్షా బంధన్ ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం.. ఇంద్రుడు.. రాక్షసులతో యుద్దానికి వెళుతున్నపుడు భార్య సచీ దేవి ఆయనకు ఓ రక్షణ తాడు కట్టింది. ఆ రక్షణ తాడు కారణంగా దేవ-దానవుల యుద్ధంలో ఇంద్రుడు గెలిచాడని ప్రజల నమ్మకం.
పురాణాల ప్రకారం చూసుకుంటే.. భార్యాభర్తల మధ్యే మొదటి రాఖీ కట్టబడింది. పురాణాల్లో మరో కథ కూడా ఉంది. మహా భారత సమయంలో అభిమన్యుడు యుద్ధానికి వెళుతున్నపుడు.. అభిమన్యుడి నాన్నమ్మ కుంతీ దేవి అతడికి ఓ రక్షణ తాడు కట్టింది. ఇలా చూసుకుంటే.. ఓ భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చు.. ఓ కూతురు తన తండ్రికి రాఖీ కట్టవచ్చు. ఓ తల్లి తన కొడుక్కి కూడా రాఖీ కట్టవచ్చు. రక్షా బంధన్ అనే కాన్సెప్ట్ కేవలం.. రక్షణకు సంబంధించింది .. కేవలం ఓ బంధానికి సంబంధించింది మాత్రం కాదు.
మారుతున్న ట్రెండ్‌లు.. బంధాలు!
ఒకప్పుడు రక్షా బంధన్.. ప్రేమాను రాగాలకు పెద్ద పీట వేస్తూ నడిచేది. కానీ, ప్రస్తుత కాలంలో మనుషుల ఆలోచనా తీరులో వచ్చిన మార్పుల కారణంగా.. అదో అవసరం.. పరువకు సంబంధించిన విషయంగా మారిపోయింది. ప్రేమతో ఎదుటి వ్యక్తికి రాఖీలు కట్టే వారు బాగా తగ్గిపోయారు. డబ్బు, కానుకల చుట్టే రక్షా బంధన్ నడుస్తోంది. అసలు కొంతమందికి రక్షా బంధన్ అంటేనే నచ్చని విషయంలా మారిపోయింది. ముహమాటానికి, ఎదుటి వ్యక్తుల మెప్పు కోసం రాఖీలు కడుతున్నవారు.. కట్టించుకుంటున్న వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు.