Mpox (Monkeypox) Symptoms: మంకీపాక్స్‌.. వైరస్‌ లక్షణాలు, నివారణ చర్యలు.. పూర్తి వివరాలు..

Monkeypax (Mpox) Symptoms, Causes in Telugu: ప్రపంచం ముంగిట మరో మహమ్మారి మాటు వేసింది. అదే మంకీపాక్స్‌ వైరస్‌. మరి ఇది ఎలా సోకుతుంది.. నివారణ, చికిత్స చర్యలు ఏంటి.. వంటి పూర్తి వివరాలు మీ కోసం..

Monkeypax (Mpox) Symptoms, Causes in Telugu: ప్రపంచం ముంగిట మరో మహమ్మారి మాటు వేసింది. అదే మంకీపాక్స్‌ వైరస్‌. మరి ఇది ఎలా సోకుతుంది.. నివారణ, చికిత్స చర్యలు ఏంటి.. వంటి పూర్తి వివరాలు మీ కోసం..

కరోనా మహమ్మారి దాడి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కోవిడ్‌ బారి నుంచి తప్పించుకున్నామని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే.. మరో వైరస్‌ ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అయ్యింది. రెండేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ మహమ్మారి.. తాజాగా మరోసారి కోరలు చాపడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ఎమర్జెన్సీ విధించింది. అయితే ఎంపాక్స్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ ఇలా ఎమర్జెన్సీ విధించడం ఇది రెండో సారి. ముందుగా ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌.. ఎంపాక్స్‌ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్‌ వల్ల ఆఫ్రికాలో ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా మృతి చెందారు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఎంపాక్స్‌ వ్యాప్తిపై గ్లోబల్‌ ఎమర్జెన్సీ విధించడమే కాక.. వైరస్‌ కట్టడికి ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించింది.

మంకీపాక్స్‌ పేరు ఎలా వచ్చిందంటే:

ఈ వైరస్‌ను మొదట 1958లో ఆఫ్రికాలో, కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ వైరస్‌ అనే పేరు వచ్చింది. అయితే ఇది మనుషులకు సోకింది మాత్రం 1970లోనే. మంకీపాక్స్‌ వ్యాధికి కారణం మంకీపాక్స్‌ వైరస్‌(ఎంపీవీ). ప్రారంభంలో ఇది ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లోనే కనిపించేంది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థలు, శాస్త్రవేత్తలు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే 2022లో ఆఫ్రికా బయట కూడా భారీ స్థాయిలో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఈ ఏడాది అనగా 2024లో సుమారు 13 దేశల్లో ఎంపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అంతర్జాతీయ సమాజం.. ఈ వ్యాధిపై పరిశోదనలు ప్రారంభించింది.

ముందుగా కాంగోలో క్లేడ్‌ 1 అనే స్థానిక స్ట్రెయిన్‌ వ్యాప్తితో ఎంపాక్స్‌ విస్తరించడం ప్రారంభమైంది. ఇప్పుడు  మరో వేరియంట్‌ వెలుగు చూసింది. ప్రస్తుతం రెండు వే రియంట్లు ఉన్నాయి. అవే క్లేడ్‌ 1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లేడ్‌ 2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌). ఈ వైరస్‌ సోకిన వ్యక్తి, జంతువులు, పదార్థాలతో కాంటాక్ట్‌ అయినప్పడు ఈ రెండు రకాల వేరియంట్లు ఇతరులకు సోకుతాయి. వీటిల్లో క్లేడ్‌ 1 రకం తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది. తాజాగా ప్రపంచ దేశాల్లో వ్యాప్తిస్తోంది క్లేడ్‌ 1కు చెందిన క్లేడ్‌ 1బీ వైరస్‌. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. కాంగోలో మొదలైన ఈ వైరస్‌.. బురుండీ, కెన్యా, రువాండా, ఉగాండా దేశాలకు పాకడంతో.. డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తమైంది.

మంకీపాక్స్‌ వ్యాప్తి ఎక్కడ ఉందంటే:

ఈ వైరస్‌ ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే విస్తరిస్తోంది. అక్కడ ఇప్పటికే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 500 మందికి పైగా చనిపోయారు. గత ఏడాదితో పోలిస్తే కేసులతో పాటు మరణించిన వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో చెప్తోంది. మంకీపాక్స్ ఇప్పుడు 13 ఆఫ్రికన్ దేశాల్లో యాక్టీవ్‌గా ఉందని వెల్లడించింది. అలానే 160 శాతం కేసులు, మరణాలు 19 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ఇప్పటికే స్వీడన్‌లో 300 కేసులు నమోదయ్యాయి. అయితే వాటి తీవ్రత తక్కువగా ఉంది.

బాధితులు ఎవరు.. మరణాల రేటు (Death Rate):

ఈ వ్యాధి బారిన పడుతున్న​ వారిలో  చిన్న పిల్లలు, 15 ఏళ్ల లోపు వారే అధికంగా ఉంటున్నారు. వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఈ వేరియంట్లలో మరణాల రేటు భిన్నంగా ఉంటుంది. క్లేడ్‌ 1లో మరణాల రేటు 3-4 శాతం ఉండగా.. క్లేడ్‌ 2లో అది 0.1 శాతం ఉందని.. అందుకే దీని ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లు మధ్యస్థంగా ఉండటతో పాటు మరణాల సంఖ్య చాలా తక్కువని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలపింది. ‍కాకపోతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో మాత్రం కాస్త ప్రమాదకరం అని చెప్పుకొచ్చింది.

వైరస్‌ ఎలా వ్యాపిస్తుందంటే:

మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లి మాట్లాడటం, తాకడం, స్వలింగ సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలానే వైరస్‌ సోకిన వారి దుస్తులు, వస్తువులు తాకడం ద్వారా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది.

మంకీపాక్స్‌ లక్షణాలు: 

మంకీపాక్స్‌ బారిన పడ్డ వ్యక్తికి 6-13 రోజుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. మంకీపాక్స్‌ లక్షణాలు ఇలా ఉంటాయి..

  • చర్మంపై దద్దర్లు,
  • జ్వరం,
  • గొంతు నొప్పి,
  • తలనొప్పి, కండరాల నొప్పులు,
  • వెన్ను నొప్పితో బాధపడతారు.
  • దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది.
  • వాటిని టచ్‌ చేస్తే వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
  • ఇది తీవ్రంగా మారితే న్యుమోనియాకు దారి తీస్తుంది.
  • చూపు మందగించడం, వాంతులు, అతిసారం లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.
  • మంకీపాక్స్ వ్యాధి మశూచిని పోలి ఉంటుంది. కానీ తక్కువ దద్దుర్లు ఉంటాయి.
  • మంకీపాక్స్‌ మరీ అంత ప్రాణాంతకం కాదు.

ఏం టెస్టులు చేస్తారంటే:

  • మంకీపాక్స్‌ సోకిందా లేదా అన్నది గుర్తించడానికి పీసీఆర్‌, యాంటీబాడీస్‌ టెస్టులు చేస్తారు.

చికిత్స:

మంకీపాక్స్‌కు ఇప్పటి వరకు ఎలాంటి యాంటీ వైరల్‌ చికిత్స పద్దతిని ఆమోదించలేదు. మశూచీ లాంటి వ్యాధులను తగ్గించడానికి వాడే మందులను దీని చికిత్సకు వాడుతున్నారు. మంకీపాక్స్‌ను పూర్తి స్థాయిలో నివారించడం కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి.

నివారణ చర్యలు:

  • మంకీపాక్స్‌ నుంచి కాపాడుకోవాలంటే.. తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  • విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడాల్సి వస్తే.. కాస్త దూరంగా ఉండాలి.
  • మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించిన వారికి దూరంగా ఉండాలి.
  • వారు వాడిన వస్తువులు, దుస్తులు, పరిసరాలను చేతులతో తాకూడదు.
  • మాస్క్‌ ధరించాలి
  • మాంసాహారం తింటే.. బాగా ఉడికించి తినాలి.

వైరస్‌​ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వైద్యులు సూచించిన మేరకు మందులు వాడాలి.
  • చర్మం దద్దుర్ల నుంచి కాపాడుకోవడం కోసం వేడి నీటి స్నానం చేయాలి.
  • మిగతా వారికి దూరంగా ఒక గదిలో ఉండాలి.
  • మీ వరకు ప్రత్యేకంగా పాత్రలను తీసుకుని ఉపయోగించుకుని.. మీరే శుభ్రం చేసుకోవాలి.
  • తగినంత నిద్ర పోవాలి. పోష​కాహారం తీసుకోవాలి.

టీకాలున్నాయా:

ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు 2 టీకాలు వినియోగంలో ఉన్నాయి. గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని.. స్ట్రాటజిక్‌ అ‍డ్వైజరీ గ్రూస్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది. గావీ, యూనిసెఫ్‌ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది.

భారత్‌లో ప్రభావం ఎలా:

ఇండియాలో 2022లో మొట్ట మొదటిసారి మంకీపాక్స్‌ని గుర్తించారు. ఆ తర్వాత గత ఏడాది జూలైలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 27 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ, ఢిల్లీ నుంచే అత్యధికం. ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కి వచ్చే ప్రయాణికుల ద్వారా మంకీపాక్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

హైదరాబాద్‌కు డేంజర్‌ బెల్స్‌:

దేశంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి ఎలా ఉన్నా హైదరాబాద్‌ వాసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. నగరంలో మంకీపాక్స్‌ కేసులు నమోదు కావడానికి అవకాశం  ఎక్కువ అంటున్నారు. అందుకు కారణం.. ఈ వ్యాధి చికిత్స కోసం చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి భాగ్యనగరం వస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు. కనుక విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయ్యే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గమనిక: పైన తెలిపిన సమాచారాన్ని iDream మీడియా నిర్థారించలేదు. WHO కథనాల ప్రకారం ప్రచురించాము.

Show comments