పాటంటే పాటే. పాట గొప్పది. అది సిరివెన్నెల గారు రాస్తే ఇంకా గొప్పది. ఎన్ని రూల్స్ మధ్యలో ఒక పాట రాయాలి..? అది ట్యూనుకు రాయాలి. కథలో పాట ఉండాలి. పాటలో కథ ఉండాలి. సినిమాలో పాట ఇమడాలి. సినిమా తీసేసి పాట వింటే కూడా బాగుండాలి. డైరెక్టరు గారికి, హీరోగారికి పాట నచ్చాలి. హీరోగారి ఫ్యాన్స్ కు పడికట్టు పదాలు పడాలి. ఆడియెన్సుకి అర్ధ్యమయ్యే లెవెల్లో మాత్రమే ఉండాలి. పండితులని మెప్పించే పదప్రయోగం ఉండాలి. మేధావులని మెప్పించే ఫిలాసఫీ ఉండాలి. విమర్శకులని ఒప్పించే నీతి వాక్యాలు ఉండాలి. రొమాన్సు లిమిట్సులోనే ఉండాలి. ఇవన్నిటినీ గెలవాలి. ఒక పల్లవి, రెండు చరణాలతో.. ఒక పాటతో కాదు.. సిరివెన్నెల గారి ప్రతీ పాటలో ఆయన సంతకం ఉంటుంది. వినగానే ఈ పాట ఆయనది అని చెప్పెయ్యొచ్చు. ప్రతీ పాటతో అక్షరాలను కరిగించి ట్యూనులో పోత పోస్తే సిరివెన్నెల పాట అవుతుంది.
” మావిచిగురు సినిమాలో “మాట ఇవ్వమ్మా చెల్లీ” పాట. హీరోయిన్ కి భర్త అంటే పిచ్చి ప్రేమ. అతను శ్రీరామచంద్రుడు. అతనిని వేరే అమ్మాయికి అప్పగించాలి. ఆయన ఉపయెగించిన పదాలు, “బంగారు సీతమ్మవై కనిపెట్టుకుంటావని”. రామయణంలోని ఉత్తరకాండ ఉంది ఆ ఒక్క వాక్యంలో. రాముడి పత్నీవ్రత్యం ఉంది ఆ వాక్యంలో. హీరోయిన్ అతిప్రేమ ఉంది. దర్శకుడు రెండు గంటల్లో చెప్పిన కథ రెండు ముక్కల్లో చెప్పేశారు.
అమ్మ గురించి అందరూ రాశారు, సిరివెన్నెల గారు కూడా చాలా సార్లు రాశారు.. అమ్మని దేవుడితో పోల్చచ్చు. ఎన్ని విశేషణాలైనా వాడచ్చు. ఎంత గొప్ప భాషైనా వాడొచ్చు. కాని మధ్యతరగతి మామూలు మనిషికి చెప్పే రీతిలో చెప్పారు, అమ్మ స్థానం గురించి, అమ్మ పడే కష్టం గురించి అక్కడ ఆ ట్యూనుకు ఇంతకంటే అతికే పదాలు పడవేమో..
ఎంత శృంగారం దట్టించినా.. కొంత బూతు తగిలించినా నడిచిపోతుంది. కాని తనకు తాను గీసుకున్న గీత దాటకుండా సున్నితమైన భావాన్ని పండించారు. రొమాన్సుని కంట్రోల్ చెయ్యడానికి శాస్త్రిగారు చాల సార్లు హీరో హీరోయిన్ మధ్య సంభాషణ సృష్టించి హాస్యాన్ని వాడతారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నెన్నో.
ఏం రాసినా, ఎంత రాసినా ఆయన అనుకున్న విలువలకు కట్టుబడి ఉండటం. పాట నాణ్యత తగ్గకుండా అది సాధించడం ఆయనకే చెల్లింది. సంగీతాన్ని ఆపాతమధురం అని, సాహిత్యాన్ని ఆలోచనామృతం అని అంటారు. మాధుర్యం పోయిన యేడు వెళ్ళిపోయింది. ఎందుకు శాస్త్రిగారు మీకు ఇంత బాధ్యత?…