ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఆలీ

  • Published - 07:05 PM, Mon - 7 November 22
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఆలీ

• సలహాదారు నియామకంపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆలీ..

• ప్రభుత్వానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని సినీనటులు మహమ్మద్ ఆలీ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండవ అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అందించిన నియామక పత్రం స్వీకరించి పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ఆలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ, మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ తెలిపారు.

ప్రజాభిమానం పొందిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అలీ కొనియాడారు. ప్రజల పట్ల జగన్ మోహన్ రెడ్డి చూపించే అభిమానం వెలకట్టలేనిదన్నారు. ప్రజలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి అనుకున్నది సాధిస్తారన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి కీర్తి, ప్రతిష్టలు సాధించారని, గొప్ప ప్రజా నాయకుడిగా, మహా నాయకుడిగా పేరొందారన్నారు. ఇచ్చిన మాటను, చెప్పిన మాటను తూ.చ తప్పకుండా ఆచరించి చూపిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో నవరత్నాలు పటిష్టంగా అమలవుతున్నాయని చెప్పిన అలీ ఇటీవల తాను విశాఖలో పర్యటించిన విషయాలను వెల్లడిస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయని, ఏ వీధిలో చూసినా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు కనిపించాయన్నారు.

లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటుడు, మానవతావాది అలీ అని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాకుండా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సమర్థవంతంగా తన సేవలను అందిస్తారన్నారు.

Show comments