వచ్చే నెల 16వ తేదీ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కనివిని ఎరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఎప్పుడో 2009లో వచ్చిన ఈ విజువల్ వండర్ అప్పట్లో క్లాసు మాసుతో సంబంధం లేకుండా అందరినీ ఊపేసింది. ఇప్పటికీ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా అవతార్ పేరుమీదున్న రికార్డులు చాలా మటుకు భద్రంగా ఉన్నాయి. హోమ్ వీడియోలోనూ ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆ మధ్య పైరసీ సైట్స్ లో అత్యధిక డౌన్లోడ్లు చేసుకున్న సినిమా ఏదని రీసెర్చ్ చేస్తే అది అవతారే అయ్యిందట.
ఇంత హైప్ ఉన్న వాతావరణంలో జేమ్స్ క్యామరూన్ ఒక బాంబు పేల్చారు. ఒకవేళ అవతార్ 2 కనక ఆశించిన స్థాయిలో ఆడకపోతే థర్డ్ పార్ట్ తో ముగించేస్తానని ఆపై ప్లాన్ చేసుకున్న అవతార్ 4 & 5 ఉండవని తేల్చి చెప్పేశారు. అంటే ఆయనకే ఏమైనా అనుమానం ఉందానే డౌట్ వస్తోంది కదూ. క్యామరూన్ ఈ కోణంలో కాకుండా వేరే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అవతార్ బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడానికి సీక్వెల్స్ తీయడం లేదని ఒకవేళ ప్రేక్షకులు కనక ఇవి ఇక్కడితో చాలనుకుంటే రిజెక్ట్ చేస్తారని అది బాక్సాఫీస్ వసూళ్లలో తెలిసిపోతుందని అందుకే 2028 దాకా రిలీజులు ఫిక్స్ చేసుకున్న అవతార్ మిగిలిన వాటిని గ్యారెంటీ ఇవ్వలేనంటున్నారు.
క్యామరూన్ వెర్షన్ ఎలా ఉన్నా ఇప్పుడున్న హైప్ కి యావరేజ్ టాక్ వచ్చినా చాలు బ్లాక్ బస్టర్ స్టాంప్ పడిపోతుంది. మరీ డిజాస్టర్ టాక్ వస్తే తప్ప ఆయన చెప్పినంతగా భయపడాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల నుంచే వంద కోట్ల దాకా ఆశిస్తున్న నిర్మాణ సంస్థ దీన్ని ఎవరికీ అమ్మడం లేదు. ఓన్ రిలీజ్ తో ముందుకెళ్తున్నారు. ఇండియా వైడ్ 600 కోట్ల దాకా రెవిన్యూ టార్గెట్ పెట్టుకున్నారు. పెద్దగా పోటీ లేని టైం కావడం అవతార్ 2 కి బాగా కలిసి వచ్చేలా ఉంది. డిసెంబర్ 16న షెడ్యూల్ చేసినవేవీ ప్రస్తుతానికి లేవు. ఆపై వారం క్రిస్మస్ లక్ష్యంలో రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్, రణ్వీర్ సింగ్ సర్కస్ లు బరిలో దిగబోతున్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో.