మెట్రో స్పీడులో కాంతార వసూళ్ల జాతర

  • Published - 12:35 PM, Sat - 29 October 22
మెట్రో స్పీడులో కాంతార వసూళ్ల జాతర

స్టార్లు లేకుండా ఒక కన్నడ డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని దాని దర్శక హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించలేదు. అందుకే అంత అనుభవమున్న అల్లు అరవింద్ తెలుగు హక్కుల డీల్ విషయంలో పర్సెంటేజ్ మాట్లాడుకున్నారు తప్ప అవుట్ రైట్ గా కొనే సాహసం చేయలేదు. లేదంటే ఇప్పుడీ కాంతార గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కు బంగారు బాతులా మారిపోయి గత ఏడాదిలో వచ్చిన డిజాస్టర్ల తాలూకు నష్టాలకు భర్తీ చేసేది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్టు కొన్నిసార్లు అద్భుతాలను ముందే ఎవరూ గుర్తించరు, జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడీ విజువల్ థ్రిల్లర్ కు ఆ మాటలు అచ్చు గుద్దినట్టు సరిపోతాయి.

ఇప్పుడీ కాంతార రిలీజై రెండు వారాలు పూర్తయ్యాయి. దూకుడు మాత్రం తగ్గించలేదు. ఏ రేంజ్ లో అంటే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ప్రసిద్ధ సుదర్శన్ 35 ఎంఎంలో నెల తిరక్కుండానే గాడ్ ఫాదర్ ని తీసేసి దీన్నే వేసేంత. దీపావళికి నాలుగు కొత్త సినిమాల హడావిడిలో స్క్రీన్లు తగ్గించుకున్న కాంతారకు ఏపీ తెలంగాణలో మళ్ళీ థియేటర్లు పెరుగుతున్నాయి. జిన్నా, ప్రిన్స్ లు ఫ్లాప్ కావడం, ఓరి దేవుడా బాగా నెమ్మదించడం, సర్దార్ డీసెంట్ రన్ కొనసాగించడం కాంతారకు కలిసి వస్తోంది. ఈ వారం కూడా అనుకోని ప్రయాణం తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో వీకెండ్ మొత్తం మళ్ళీ రిషబ్ బృందం కంట్రోల్ లోకి వెళ్లనుంది. అందుకే ప్రమోషన్లు ఆపట్లేదు

కాంతార మొత్తం పధ్నాలుగు రోజులకు గాను 17 కోట్ల 25 లక్షల దాకా షేర్ తెచ్చినట్టు ట్రేడ్ టాక్. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది 32 కోట్లకు దగ్గరగా వెళ్తుంది. కేవలం రెండున్నర కోట్లకు జరిగిన ప్రీ రిలీజ్ కు దక్కిన మొత్తమిది. ఇంకో వారం తర్వాత కానీ ఫైనల్ రన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంకో అయిదు కోట్లు ఈజీగా వసూలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చూసి ప్రత్యేకంగా రిషబ్ శెట్టిని ఇంటికి పిలిపించి మరీ అభినందించడం చూస్తుంటే దీని రేంజ్ ఎక్కడి దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అన్ని బాషల వెర్షన్లు కలిపి కాంతార ఈ వారం ముగిసేలోపే 250 కోట్ల గ్రాస్ ని అఫీషియల్ గా టచ్ చేయనుంది. కంటెంట్ పవర్ ఇది

Show comments