iDreamPost
android-app
ios-app

తెలుగు మార్కెట్ మీద కోలీవుడ్ కన్ను

తెలుగు మార్కెట్ మీద కోలీవుడ్ కన్ను

టాలీవుడ్ దర్శకుల పరిధి పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి యునానిమస్ సక్సెస్ లు చూశాక కోలీవుడ్ స్టార్ హీరోలు మనవాళ్లతో చేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు ఇక్కడ మార్కెట్టే పెద్దగా లేని శివ కార్తికేయన్ అనుదీప్ తో చేతులు కలిపి ప్రిన్స్ తో ముందుకొస్తున్నాడు.  ఏకంగా ముగ్గురు తెలుగు నిర్మాతలు ఈ ప్రాజెక్టుకు తోడయ్యారు. సురేష్ బాబు,సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ రావు పార్ట్ నర్స్ గా తెరకెక్కింది. అంచనాలు భారీగా లేకపోయినా రిటర్న్స్ మీద నమ్మకంతో ఉన్నారు. అనూహ్యంగా ఇది తమిళంలోనూ ఏమంత పెద్దగా బజ్ తెచ్చుకోలేకపోయింది. పూర్తిగా టాక్ అండ్ రివ్యూల మీద ఆధారపడే రేపటి ఫలితం రాబోతోంది.

ఇక ధనుష్ తో సితార బ్యానర్ తీస్తున్న సర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ మిస్టర్ మజ్ను, నితిన్ రంగ్ దేలతో ఒక హిట్టు రెండు ఫ్లాపులతో ఉన్న వెంకీ అట్లూరి ఈ సర్ కు డైరెక్టర్. ద్విభాషా అని చెప్పడమే కాదు తెలుగు వెర్షన్ కూడా సెపరేట్ గా తీస్తున్నట్టు టీజర్లో లిప్ సింక్ ని బట్టి అర్థమవుతోంది. అయితే దీనికీ ఓ రేంజ్ లో అంచనాలేం ఏర్పడలేదు. డిసెంబర్ మొదటి వారానికి ప్లాన్ చేసుకున్న రిలీజ్ ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇక విజయ్ తో వందల కోట్ల బిజినెస్ ని లక్ష్యంగా పెట్టుకుని దిల్ రాజు తీస్తున్న వారసుడు వచ్చే నెల చిత్రీకరణ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. 2023 సంక్రాంతి విడుదల ఫిక్స్ చేసుకున్నారు.

విచిత్రంగా ఈ వారసుడు మీద సైతం ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఏమీ లేవు. మెల్లగా బజ్ పెరుగుతోంది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి చాలా గ్యాప్  తీసుకుని డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళికి వదలబోతున్న ఫస్ట్ ఆడియో సింగల్ వచ్చాక తమన్ సంగీతం ఎలివేషన్ ని ఇంకొంచెం పెంచుతుందేమో చూడాలి. ఇలా ఆరవ హీరోలు మన దర్శకుల వెంటపడుతూ ప్యాన్ ఇండియాని టార్గెట్ గా చేసుకుంటున్నారు కానీ ఎటొచ్చి వాటి కథలే ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఇక్కడ చెప్పిన మూడింట్లో ఏది తీసుకున్నా గతంలో చూడని బ్యాక్ డ్రాప్ ఏమీ కనిపించదు. మొత్తానికి మనవాళ్ళు అక్కడి ట్రాప్ లో పడ్డారా లేక వాళ్లొచ్చి దెబ్బతిన్నారా అనేది ఇంకో రెండు నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వస్తుంది.