గత రెండేళ్లుగా ఏదైనా సినిమా పెద్ద హిట్టయినా లేక జనంలో దాని మీద అంతో ఇంతో ఆసక్తి రేగినా ఓటిటి ప్రీమియర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న వాటి గురించి చెప్పదేముంది. అలాంటి రెండు లేటెస్ట్ సెన్సేషన్స్ డిజిటల్ లో రాబోతున్నాయి. అది కూడా ఒకే ప్లాట్ ఫార్మ్ లో. మొదటిది పొన్నియన్ సెల్వన్ 1. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయడం దాదాపు లాంఛనమే. అఫీషియల్ డేట్ ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ చేసినట్టు తెలిసింది. ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లస్ ప్రమోషనల్ క్యాంపైన్ తో అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉందట సదరు డిజిటల్ సంస్థ.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ ఒక్క తమిళ వెర్షన్ నుంచే వరల్డ్ వైడ్ గా నాలుగు వందల కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు డైరెక్ట్ యాడ్స్ ఇచ్చారు. తెలుగులో అంత స్థాయిలో స్పందన రాలేదు కానీ బ్రేక్ ఈవెన్ జరగాల్సిన పది కోట్లకు సైతం తృటిలో తప్పేంత దూరంలో ఆగిపోయింది. దసరా రిలీజులు తక్కువ గ్యాప్ తో దాడి చేయడంతో పిఎస్ 1కు పికప్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. అందుకే తెలుగు వెర్షన్ కు భారీ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇక తమిళం గురించి చెప్పేదేముంది. ఇక ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిన కాంతార హక్కులు కూడా ప్రైమ్ వద్దే ఉన్నాయి. ఇది మరీ లేట్ కాకుండా నవంబర్ లో తెస్తున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముందు చేసుకున్న అగ్రిమెంట్ నవంబర్ 4. కానీ ప్రస్తుతం మంచి రన్ కొనసాగుతున్న తరుణంలో ఆలస్యం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. లేదూ కెజిఎఫ్ 2 తరహాలో పే పర్ వ్యూ మోడల్ లో ఆఫర్ చేయొచ్చు. అలా చేసినా ఏదో ఒక రూపంలో పైరసీలో ఆడియన్స్ ఫ్రీగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మరి ప్రైమ్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది. థియేటర్లలోనే రెండు వందల కోట్ల గ్రాస్ అందుకున్న కాంతారకు స్మార్ట్ స్క్రీన్ పై పొన్నియన్ సెల్వన్ 1 కన్నా ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మణిరత్నం మేజిక్ కి అంతగా ఫిదా కాని మన ఆడియన్స్ రిషబ్ శెట్టి మాయాజాలానికి ఫుల్ మార్క్స్ ఇచ్చారు.