iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బైక్‌లు

  • Published Aug 24, 2023 | 9:23 AMUpdated Aug 24, 2023 | 9:23 AM
  • Published Aug 24, 2023 | 9:23 AMUpdated Aug 24, 2023 | 9:23 AM
బ్రేకింగ్‌: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బైక్‌లు

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేపీ నగర్ ప్రాంతంలోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్రి ప్రమాదం కారణంగా షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న సుమారు 300 వరకు బైక్‌లు దగ్ధం అయ్యాయి. విజయవాడలోని చెన్నై-కోల్‌కతా హైవేకు సమీపంలో ఈ షోరూమ్ ఉంది. బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొంత సమయానికే.. ఈ మంటలు గోదాము వరకు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే దీని గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే.. 3 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం చోటు చేసుకున్న గోదాములో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా పార్క్‌ చేసి ఉంచారు. పైగా వాటిని ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్‌ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో.. ఇక్కడ వందల సంఖ్యలో టూ వీలర్స్‌ని ఉంచుతారు. బైక్ షోరూంతో పాటు సర్వీస్‌ సెంటర్‌‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో గోడౌన్‌, షోరూం, సర్వీస్‌ సెంటర్‌ కూడా ఉండటంతో ఎక్కువ వాహనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఘటనలో దాదాపు 300 బైక్‌లు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది అంటున్నారు.

అయితే ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేదంటే.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు.. షోరూమ్‌లో సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చుట్టు పక్కల జనావాసాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి