Dharani
Dharani
అనతికాలంలోనే నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వరలక్ష్మి టిఫిన్స్‌లో డ్రగ్స్ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు 14 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర రెడ్డితో పాటు.. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనురాధ అనే మహిళ గోవా నుంచి అక్రమంగా డ్రగ్స్ నగరానికి తరలించేది. ఆ తర్వాత ప్రభాకర రెడ్డితో పాటు మరి కొందరితో కలిసి డ్రగ్స్‌ని నగరంలో రహస్యంగా విక్రయించేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రభాకరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ వార్త తెలుసుకున్న సన్నిహితులు.. పాపం సామాన్య కుటుంబ నుంచి వచ్చి.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. కానీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాకరరెడ్డి గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి పదో తరగతిలోనే చదువు ఆపేశాడు. ఆ తర్వాత రోడ్డుపక్క నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. నాణ్యమైన, రుచికరమైన టిఫిన్ అందిస్తూ.. అనతి కాలంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో 2017లో వ్యాపారం నిమిత్తం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. గచ్చిబౌలి పరిధిలోని డీఎల్‌ఎఫ్‌లో చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. రుచి, నాణ్యత బాగుండటంతో జనాలు కూడా ఆ టిఫిన్ సెంటర్ వద్దకూ క్యూ కట్టారు. కొద్ది కాలంలోనే వ్యాపారం బాగా పుంజుకుంది. వ్యాపారంలో రాబడి పెరగడంతో.. బ్రాంచీలను కూడా విస్తరించాడు. వరలక్ష్మి టిఫిన్స్ పేరుతో హైదరాబాద్ నగరంలో ఏకంగా 10 వరకు బ్రాంచీలు ఒపెన్ చేశాడు. నగరంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లు బాగా ఫేమస్ అయ్యాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో దీనికి మంచి రేటింగ్ ఉంది. ప్రతి టిఫిన్ సెంటర్ నుంచి రోజూ లక్షలాది రూపాయల ఆదాయం వస్తోంది.
జీవితంలో సామాన్యుడి స్థాయి నుంచి ప్రస్తుతం రోజుకు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు ప్రభాకర్ రెడ్డి. ఆదాయం పెరగడంతో పాటు.. జల్సాలు, చెడు అలవాట్లు కూడా వచ్చి చేరాయి. దానిలో భాగంగా స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభమైంది. అలా మెల్లిగా డ్రగ్స్‌కు, ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్‌రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్ దందా చేసే స్థాయికి ఎదిగాడు. అనురాధ ద్వారా గోవా నుంచి నగరానికి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించేవాడని తెలుస్తోంది.. ఆ డ్రగ్స్‌ను వారిద్దరూ వాడటమే కాక మరికొందరికి విక్రయించేవారని తెలిసింది. ఈ దందాలో వారికి పల్లెటూరి పుల్లట్లు టిఫిన్ సెంటర్ యజమాని వెంకట శివసాయికుమార్ సహకరించేవాడు.
డ్రగ్స్ తెప్పించడం కోసం ప్రభాకర్ రెడ్డి అనురాధను గోవాకు విమానంలో పంపేవాడు. అక్కడ డ్రగ్స్ తీసుకుని బస్సు మార్గంలో చాకచక్యంగా హైదరాబాద్ వచ్చేది. ఇలా కొంతకాలంగా గోవాకు వెళ్తున్న అనురాధ.. గోవా నుంచి వచ్చేటప్పుడు, రెండు మూడు నగరాల్లో బస్సు దిగి, వేరే బస్సులు ఎక్కుతూ ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తపడేది. ఆ డ్రగ్స్ తీసుకొచ్చి ప్రభాకర్‌రెడ్డికి అందజేసేది. ఇలా గుట్టుగా సాగుతున్న వీరి రహస్య దందా తాజాగా బట్టబయలైంది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.