P Venkatesh
P Venkatesh
మహానగరంగా.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో నేరాలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. నగరంలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గరి నుంచి టిఫిన్ సెంటర్ల వరకు కస్టమర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లంచ్ చేయడానికి రెస్టారెంట్లకు వెళ్లిన కస్టమర్ల పట్ల అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, దాడులకు పాల్పడి గాయపర్చడం వంటి ఘటనలు చూస్తే హోటళ్లు, రెస్టారెంట్ల ఆగడాలు ఏవిధంగా ఉన్నాయో వీటిని బట్టి తెలుసుకోవచ్చు. హోటళ్ల చేసే నిర్వాకానికి కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. రెస్టారెంట్లు నేరాలకు అడ్డాగా మారాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా హైదరాబాదర్ నగరంలో పంజాగుట్టలో ఉన్న మెరీడియన్ రెస్టారెంట్ లో డిన్నర్ కోసం వెళ్లిన లియాఖత్ అనే కస్టమర్ పట్ల రెస్టారెంట్ సిబ్బంది దాడికి పాల్పడి గాయపర్చి అతడి మరణానికి కారణమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఎక్స్ ట్రా రైతా కావాలని లియాఖత్ రెస్టారెంట్ సిబ్బందిని అడగగా వారు స్పందించలేదు. ఈ క్రమంలోనే కస్టమర్ కు సిబ్బందికి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. కస్టమర్ కు కనీస మర్యాద ఇవ్వకుండా అతడిపై దాడి చేసి మరణానికి కారణమైన మెరీడియన్ రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న వాటిల్లో ఏవిధంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.
మరో వైపు టిఫిన్ సెంటర్లలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ నేరాలకు ఆజ్యం పోస్తున్నారు నిర్వాహకులు. టిఫిన్ సెంటర్ల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ లో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ లకు మంచి పేరుంది. నిత్యం వేలాది మంది కస్టమర్లు ఇక్కడ టిఫిన్ కోసం వస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు డ్రగ్స్ స్మగ్లర్లకు సహకరించారు. అనురాధ అనే మహిళ నైజీరియన్ వ్యక్తి వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి దానిని హైదరాబాద్ లో రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము పోగేసుకుంటుంది. ఈ కిలేడీ మహిళకు వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సహకరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు టిఫిన్ సెంటర్లో సోదాలు చేయగా డ్రగ్స్ వెలుగు చూశాయి. వెంటనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు టిఫిన్ సెంటర్ ఓనర్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధమైన ఘటనలతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. హోటళ్లకు భోజనం కోసం వెళితే ప్రాణాల మీదకు వస్తుందంటూ కస్టమర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు.