Dharani
హైదరాబాద్ లో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షలో ఒకరి బదులు మరోకొరు ఎగ్జామ్ రాసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు..
హైదరాబాద్ లో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షలో ఒకరి బదులు మరోకొరు ఎగ్జామ్ రాసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు..
Dharani
చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే చాలా మంది యువత జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం అహోరాత్రులు కష్టపడి చదువుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో పడి సరిగా తిండి కూడా తినరు. తల్లిదండ్రులకు దూరంగా.. పట్టణాల్లో ఉంటూ.. కడుపు నిండా తిండి లేక.. కంటి నిండా నిద్ర కూడా పోకుండా.. అహోరాత్రాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమిస్తారు. అయితే ఇలా కష్టపడ్డవారందరికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే కచ్చితంగా రాదనే చెప్పవచ్చు. ఎంత కష్టపడ్డా సరే.. అవగింజంత అదృష్టం లేకపోతే.. జాబ్ రాదు.
ఓ పక్క లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంతలా కష్టపడుతుంటే.. కొందరు కేటుగాళ్లు మాత్రం అడ్డ దారుల్లో కొలువులో చేరే ప్రయత్నాలు చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ లో భాగంగా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాశారు. కానీ చివరకు జాబ్ వచ్చాక దొరికిపోయారు. ఆ వివరాలు..
ఈ సంఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది. ఉద్యోగం కోసం ఓ యువకుడు అడ్డదారి తొక్కాడు. తనకు బదులుగా మరో వ్యక్తితో పరీక్ష రాయించాడు. కానీ చివరకు ఉద్యోగం వచ్చిన తర్వాత.. చిన్న క్లూతో అడ్డంగా దొరికిపోయాడు. పరీక్ష రాసిన వ్యక్తి.. ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఇద్దరూ ఒక్కరే కాదని.. వేర్వేరు వ్యక్తులని గుర్తించిన అధికారులు అతడిని పోలీసులు అప్పగించారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకి చెందిన బాల్‌రాజ్ (23) అనే యువకుడు.. గతేడాది అనగా 2023, నవంబరులో అటవీ శాఖ ఉద్యోగాల భర్తీ కోసం కండక్ట్ చేసిన పరీక్ష రాయడానికి అప్లై చేశాడు.
జాబ్ కు అప్లై చేసే ముందే.. బాల్ రాజ్ పక్కా ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగాడు. తనకున్న తెలివితేటలకు ఉద్యోగం రావడం అసాధ్యమని భావించిన బాల్ రాజు.. తన బదులు తన స్నేహితుడు అజయ్ పరీక్ష రాస్తే కచ్చితంగా జాబ్ వచ్చి తీరుందని అనుకున్నాడు. దీని గురించి అజయ్ తో చర్చించి.. తన బదులు అతడు పరీక్ష రాసేలా ఒప్పించాడు. అజయ్ అంగీకరించడంతో.. ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు బాల్ రాజ్ తన ఫోటోకు బదులు స్నేహితుడు అజయ్ ఫోటోను అప్‌లోడ్ చేశాడు.
హాల్ టిక్కెట్‌లో ఆ ఫోటో వస్తే.. పరీక్ష రాయడానికి ఎటువంటి సమస్య ఉండదని ముందుగానే వీరిద్దరూ ఇలా ప్లాన్ చేశారు. చివరకు వారు అనుకున్నట్టుగానే హాల్ టిక్కెట్ రావడం.. అల్వాల్ లయోలా అకాడమీలో బాల్ రాజ్ బదులు అజయ్.. పోటీ పరీక్ష రాయడం జరిగిపోయింది. ఫలితాలు వెల్లడి కాగా.. బాల్‌రాజ్ ఉద్యోగానికి అర్హత సాధించాడు.
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అతడికి అపాయింట్‌మెంట్ లెటర్ పంపారు. అయితే, ఇక్కడే అతడి బండారం బయటపడింది. ఉద్యోగంలో చేరడానికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష రాసిన వ్యక్తి ఫొటో వేర్వేరుగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే దీని గురించి బాల్ రాజ్ ను నిలదీయగా.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరం అంగీకరించాడు బాల్ రాజు. తన స్థానంలో పరీక్ష రాసింది వేరే వ్యక్తి అని చెప్పాడు.
దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్ రాజ్ పై కేసు నమోదు చేయడమే కాక.. శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. బాల్ రాజ్ స్థానంలో పరీక్ష రాసిన వ్యక్తి, అజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.