Uppula Naresh
Uppula Naresh
తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని బక్క హేమ్లాతండాకు చెందిన చాంప్ల అనే వ్యక్తి శనివారం రాత్రి భార్యతో పాటు బోగ్గుబట్టీకి కాపలాగా వెళ్లి తెల్లారేసరికి అతడు శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలోనే మృతుని తల్లి.. నా కొడుకుని కోడలు అరుణనే ఆమె ప్రియుడితో కలిసి హత్య చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారించగా.. భార్యే భర్తను ఆమె ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆమె కొడుకు కూడా సాక్ష్యం చెప్పడంతో మొత్తానికి పోలీసులు అసలు నిందితురాలు అరుణే అని అనుమానిస్తున్నారు. ఇంతకు ఈ కేసులో ఏం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే?
స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం హేమ్లా తండాకు చెందిన గగులోతు చాంప్ల (38) ఇదే తండాకు చెందిన అరుణను 12 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. అయితే ఇతడు స్థానికంగా వ్యవసాయంతో పాటు బాజిరెడ్డి మండలం పూర్వతండాలో బొగ్గు బట్టీ వ్యాపారం కూడా చేసేవాడు. అలా వీరి కాపురం కొన్ని రోజుల పాటు సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి చాంప్ల తన భార్య అరుణ, అతని కుమారుడు ధనుష్ ను వెంట పెట్టుకుని పూర్వతండాలో ఉన్న బొగ్గు బట్టీ వద్దకు కాపలాగా వెళ్లారు.
అదే రోజు రాత్రి అరుణ, ఆమె కుమారుడు ఓ చోట నిద్రించగా, చాంప్ల మరో చోట నిద్రపోయాడు. కట్ చేస్తే.. ఆ రోజు అర్థరాత్రి కొందరు వ్యక్తులు వచ్చి నిద్రపోతున్న చాంప్లను కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇక తెల్లారేసరికి చాంప్ల శవమై కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏం తెలియనట్లుగా మృతుని భార్య అరుణ మొసలి కన్నీరు కార్చింది. ఇదే విషయం చాంప్ల కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏం జరిగిందని అరుణను అడగగా.. ఏం జరిగిందో నాకు తెలియదంటూ తెలిపింది. కానీ, చాంప్ల తల్లికి మాత్రం.. కోడలు అరుణపై అనుమానం ఉంది. ఆమెనే హత్య చేసి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు.
అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతుని తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతని భార్య అరుణను విచారించారు. మొదట్లో తనకేం సంబంధం లేదని తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక అనంతరం పోలీసులు మృతుని కుమారుడైన ధనుష్ ను విచారించగా.. ఆ రోజు రాత్రి ఎవరో కొందరు వ్యక్తులు వచ్చి మా నాన్నను కొట్టారు. ఆ సమయంలో నాకు వెంటనే మెలకువ వచ్చింది. ఇదే విషయం మా అమ్మకు చెప్పగా.. నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కుని పడుకో అంటూ కోప్పడింది అంటూ ధనుష్ చెప్పకొచ్చాడు. ఇక మొత్తానికి ఈ కేసులో భార్య అరుణే భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా సమాచారం. ప్రియుడి కోసం భార్య అరుణనే భర్తను హత్య చేసినట్టుగా పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.