iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నా వదల్లేదు.. బలవంతంగా అబార్షన్‌ చేయించి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నా వదల్లేదు.. బలవంతంగా అబార్షన్‌ చేయించి..

తమను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న యువతిపై కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. భర్తను వదిలేయాలని వేధించటమే కాకుండా.. అబార్షన్‌ సైతం చేయించారు. ఇంట్లో బంధించి ఇబ్బందులు పెట్టసాగారు. అంతటితో ఆగకుండా ఆమెకు రెండో పెళ్లి చేయటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లోంచి తప్పించుకున్న యువతి భర్తను కలిసింది. పెద్దల అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు..

ఒంగోల్‌లోని పుల్లలచెరువు గ్రామానికి చెందిన దేశావత్‌ రూపాబాయి గుంటూరులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు ప్రేమ విషయం పెద్దలకు తెలియజేశారు. అయితే, రూపాబాయి కుటుంబసభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ నాలుగు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రూపాబాయి పవన్‌తో పెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, ఇందుకు వారు ఒప్పుకోలేదు. తాము చూసిన సంబంధమే చేసుకోవాలని పట్టుబట్టారు. అలా చేయకుంటే చంపేస్తామని కూడా బెదిరించారు.

గర్బంతో ఉన్న రూపను నంద్యాలలోని బంధువుల ఇంటికి పంపేశారు. అక్కడ ఆమెతో బలవంతంగా సంతకాలు పెట్టించి అబార్షన్‌ చేయించారు. అంతటితో ఆగకుండా మరో పెళ్లికి ఏర్పాట్లు చేయసాగారు. ఈ నేపథ్యంలోనే రూపాబాయి ఇంటినుంచి తప్పించుకుంది. భర్త పవన్‌ దగ్గరకు వచ్చింది. తాజాగా, ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఓ వినతి పత్రం అందజేశారు. తమకు రక్షణ కల్పించాలని, తనను చిత్ర హింసలు పెట్టిన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతిపై ఆమె కుటుంబసభ్యలు వేధింపులకు పాల్పడిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.