iDreamPost
android-app
ios-app

దారుణం.. అశ్లీలంగా ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఇద్దరు యువతుల బలవన్మరణం!

  • Published Sep 06, 2023 | 11:07 AMUpdated Sep 06, 2023 | 11:07 AM
  • Published Sep 06, 2023 | 11:07 AMUpdated Sep 06, 2023 | 11:07 AM
దారుణం.. అశ్లీలంగా ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఇద్దరు యువతుల బలవన్మరణం!

దేశంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడది కనిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా కొంతమంది మగాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  కొంతమంది ఆకతాయిలు ఇద్దరు యువతుల వాట్సాప్ డీపీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడిన దారుణ ఘటన నల్లగొండలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు తమ వాట్సాప్ డీపీలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మాధ్యమాల్లో పెట్టడంతో పదిమందిలో పరువు పోతుందని మనస్థాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.  వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు జిల్లా కేంద్రంలో హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. వీరిద్దరూ ఇంటర్ నుంచి మంచి స్నేహితురాళ్లు. ఇటీవల కాలేజ్ కి సెలవులు రావడంతో ఇంటి వద్ద ఉంటున్నారు. మంగళవారం కాలేజ్ లో ల్యాబ్ పరీక్షలు ఉన్నాయని చెప్పి నల్లగొండకు చేరుకున్నారు. ఎన్జీ కాలేజ్ వేనుక రాజీవ్ పార్క్ కి వెళ్లి తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డారు. పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకొని యువతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

యువతుల పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.. చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. అప్పటికే తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి బెదిరింపులకు పాల్పపడుతున్నారని అందుకే ఆత్మహత్య చేసుకున్నామని న్యాయమూర్తికి మరణ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కాగా, మృతురాళ్లు నార్కట్‌పల్లి మండలానికి చెందిన మనిషా, శివాని లుగా గుర్తించారు.  కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇద్దరు యువతుల మొబైల్ ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నామని.. బ్లాక్ మెయిల్ చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  తమ కూతుళ్ల మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి