iDreamPost
android-app
ios-app

శారదా స్కామ్‌ని గుర్తు చేస్తోన్న మార్గదర్శి మోసాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

  • Published Aug 20, 2023 | 2:42 PM Updated Updated Aug 20, 2023 | 2:42 PM
  • Published Aug 20, 2023 | 2:42 PMUpdated Aug 20, 2023 | 2:42 PM
శారదా స్కామ్‌ని గుర్తు చేస్తోన్న మార్గదర్శి మోసాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బ్రాంచ్‌లలో గత మూడు రోజులుగా అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మార్గదర్శి మోసాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని చూస్తే.. దేశంలోనే సంచలనం సృష్టించిన శారదా చిట్స్‌ స్కామ్‌ గుర్తుకు వస్తుంది అంటున్నారు అధికారులు. మార్గదర్శిలో చోటు చేసుకున్న మోసాలు కూడా శారదా చిట్స్‌ స్కామ్‌కు ఏమాత్రం తక్కువగా లేవని అంటున్నారు అధికారులు. గత మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్‌ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలను హెచ్చరించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘గత మూడు రోజులుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచ్‌లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక వేలంపాటలోనూ అనేక అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. ఇక సెక్షన్‌ 17 ప్రకారం.. చిట్‌ఫండ్‌ స్టార్టింగ్‌లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు అని తెలిపారు.

అంతేకాక ‘‘షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులను అక్రమంగా లాక్కుంటున్నారు. ఇక మార్గదర్శిలో చోటు చేసుకుంటున్న మోసాలు, అవకతవకలను ప్రజలకు, చందాదారులకు తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని’’ ఈ సందర్భంగా రామకృష్ణ కోరారు. అనంతరం సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ మాట్లాడుతూ.. మార్గదర్శి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

మార్గదర్సి చిట్ ఫండ్‌లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ నంబర్‌ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారని తెలిపారు. ఇందుకు సంబంధించి చీరాల వన్ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 283/23 కేసుగా నమోదు చేశాం అని తెలపడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ప్రదర్శించారు. అలానే అనకాపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కూడా మరో బాధితుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారని తెలిపారు.

ఇదేకాక రాజమండ్రి టూ టౌన్‌లో మరొక బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్శి రాజమండ్రి బీఎంపై 179/23…409,420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించాఉ. ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశామని.. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్‌కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని చెప్పుకొచ్చారు. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్‌ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్‌ చేయాల్సిన నెంబర్‌ 9493174065 అని అధికారులు తెలిపారు.