మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. నడిరోడ్డుపై భార్యను పొడిచి చంపిన భర్త!

  • Author Soma Sekhar Published - 12:18 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 12:18 PM, Sun - 20 August 23
మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. నడిరోడ్డుపై భార్యను పొడిచి చంపిన భర్త!

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రేమించిన వాడే భర్తగా రావడంతో.. తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని, ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ యువతి. అలా మూడు సంవత్సరాలు అన్యోన్యంగా వారి దాంపత్యం జీవితం సాగింది. కానీ ఊహించని విధంగా జరిగిన ఓ సంఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రి కళ్ల ముందే తన కూతురిని పొడిచి చంపాడు అల్లుడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో చోటుచేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం 14వ వార్డులో సాయిలక్ష్మి కలమ సంధ్య (సంధ్యారాణి), రాంబాబు దంపతులు నివసిస్తున్నారు. వీరు మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు 18 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట ఓ గొలుసు దొంగతనం కేసులో రాంబాబు జైలుకు వెళ్లాడు. దీంతో సంధ్య తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లి.. విడాకుల కోసం ప్రయత్నిస్తోంది. కాగా.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన రాంబాబు భార్యతో గొడవపడుతూ తన బిడ్డను తనకు ఇవ్వాలని సంధ్యతో తరచుగా గొడవపడుతున్నాడు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన తండ్రి సత్యనారాయణతో కలిసి స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లింది సంధ్య. ఆలయానికి వెళ్లి వస్తుండగా.. రాంబాబు ఆమెను అడ్డుకుని నడిరోడ్డుపైనే భార్య అని కూడా చూడకుండా.. కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. కొద్ది దూరంలో ఉన్న తండ్రి ఇది చూసి పరిగెత్తుకు వచ్చేలోగా రాంబాబు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన తన కూతురిని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా.. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. దాంతో తన కళ్ల ముందే కన్న కూతురు చనిపోతుంటే కాపాడుకోలేకపోయానే అని గుండెలు పగిలేలా ఏడ్చాడు తండ్రి.

ఇక హత్య చేసిన తర్వాత రాంబాబు ఆకివీడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ విషయం తెలియడంతో.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన పై అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సంధ్య మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: ఏ సమస్యా లేదు.. అయినా ఇంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో

Show comments