AIతో ముఖం మార్చుకుని వీడియో కాల్‌.. స్నేహితుడే అనుకుని భారీగా మోసపోయిన వ్యక్తి!

గత కొన్ని రోజులుగా మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ గురించి.. అదేనండి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ గురించి పెద్ద ఎత్తున్న చర్చ సాగుతోంది. ఏఐ వినియోగం పెరిగిన కొద్ది.. ఉద్యోగాలు ఉడతాయని.. నిరుద్యోగిత పెరుగుతుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలు జనాలను భయపెడుతున్నాయి. ఇదిలా ఉండగా.. డిజిటిల్‌ పేమెంట్లు పెరిగిన తర్వాత.. అనేక రకాలుగా జనాలను మోసం చేస్తోన్న సైబర్‌ నేరగాళ్లు ఏఐని సరికొత్త అస్త్రంగా వాడుకునేందుకు రెడీ అవుతున్నారు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుల జేబు గుల్ల చేస్తున్నారు. ఇక తాజాగా ఏఐ కారణంగా ఓ వ్యక్తి.. భారీ ఎత్తున మోసపోయాడు. ఇంతకు ఏం జరిగింది.. ఎలా మోసపోయాడు అంటే..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతతో ముఖాన్ని మార్చుకొని.. వాట్సాప్​ వీడియో కాల్​ ద్వారా ఓ వ్యక్తిని భారీగా మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. కాల్‌ చేసింది తన స్నేహితుడని భావించి.. బాధితుడు రూ.40వేలు మోసగాడికి ఇచ్చేశాడు. మళ్లీ అతడు డబ్బులు అడగ్గా.. అనుమానమొచ్చి ఆరా తీస్తే మొత్తం విషయం బయటపడింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోజికోడ్​కు చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని నెంబర్​ నుంచి వాట్సాప్​ వీడియో కాల్​ వచ్చింది. అందులో మాట్లాడుతున్న వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్​లో ఉంటున్న తన స్నేహితుడిని పోలి ఉన్నట్లు గుర్తించాడు రాధకృష్ణ. దాంతో కాల్‌ చేసింది తన స్నేహితుడే అని నమ్మాడు బాధితుడు.

పైగా వీడియో కాల్​ చేసిన నిందితుడు రాధాకృష్ణతో మాట్లాడుతూ బాధితుడికి తెలిసిన కొందరి పేర్లను చెప్పాడు. దాంతో రాధకృష్ణ తనకు కాల్‌ చేసింది తన స్నేహితుడే అని పూర్తిగా నమ్మాడు. ఈ క్రమంలో సదరు సైబర్‌ నేరగాడు.. తాను దుబాయ్​లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాలని రాధాకృష్ణను అడిగాడు. భారత్​కు రాగానే ఇచ్చేస్తానని, తనకు వెంటనే రూ.40,000 ఇవ్వమని కోరాడు. దీంతో రాధాకృష్ణ అతడి అకౌంట్‌కు రూ.40వేలు పంపేశాడు. ఆ తర్వాత ఆ సైబర్‌ మోసగాడు మళ్లీ కాల్‌ చేసి. .మరో రూ.35 వేలు అడిగాడు. దీంతో రాధాకృష్ణకు అనుమానం వచ్చి.. తన స్నేహితుడిని సంప్రదించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు తాను రాధకృష్ణకు కాల్‌ చేయలేదని బాధితుడి స్నేహితుడు తెలిపాడు.

దాంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించిన రాధాకృష్ణ. జులై 15న 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కి కాల్​ చేసి ఫిర్యాదు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విభాగం.. దర్యాప్తు చేపట్టింది. ఫిర్యాదు అందుకున్న రోజుల వ్యవధిలోనే మోసగాడిని గుర్తించింది. అతడి దగ్గర నుంచి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణకు తిరిగి అప్పగించింది.

ఫేక్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి..

ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయని కేరళ పోలీసులు తెలిపారు. తెలియని నెంబర్​ నుంచి ఆడియో, వీడియో కాల్​ వచ్చి.. వాటి ద్వారా ఎవరైనా మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరితే స్పందించవద్దని కేరళ పోలీసులు సూచించారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే వెంటనే కేరళ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని కోరారు. హెల్ప్​లైన్​ నెంబర్​.. 24 గంటల పాటు పనిచేస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.

Show comments