Venkateswarlu
Kerala Jasna Case: ఆరేళ్లు అయినా జష్న కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. సీబీఐ కూడా తాజాగా చేతులు ఎత్తేసింది. ఆమె ఏమైందో తమకు తెలీదంటూ కోర్టుకు తుది రిపోర్టు అందజేసింది.
Kerala Jasna Case: ఆరేళ్లు అయినా జష్న కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. సీబీఐ కూడా తాజాగా చేతులు ఎత్తేసింది. ఆమె ఏమైందో తమకు తెలీదంటూ కోర్టుకు తుది రిపోర్టు అందజేసింది.
Venkateswarlu
కేరళ.. ప్రకృతి అందాలకు కేరాఫ్, పురాతన ఆలయాలకు నెలవు, అత్యధిక విద్యావంతుల ఉండే రాష్ట్రం.. ఈ లెక్కలు, గొప్పలు అన్నీ పైకి మాత్రమే. దేశం ఉలిక్కిపడి క్రైమ్స్ కి కూడా కేరళ రాష్ట్రమే కేరాఫ్. అక్కడ జరిగిన ఎన్నో క్రైమ్ కథలు.. ఊహకి కూడా అందని విధంగా ఉంటాయి. అలాంటి ఓ కేసు 21 ఏళ్ల జష్న మిస్సింగ్ కేసు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువతి మిస్ అయ్యింది. ఓ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, క్రైమ్ బ్రాంచ్ ఆ అమ్మాయి ఐడెంటిటీ కనిపెట్టలేకపోయాయి. చివరికి సీబీఐ లాంటి సంస్థ 6 ఏళ్ళ పాటు ఇన్వెస్టిగేషన్ చేసి.. ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టడం అసాధ్యం.. ఇప్పటికైతే ఆమె బతికుందో, చనిపోయిందో చెప్పలేము అని కోర్టుకు నివేదిక సమర్పించింది అంటే.. ఈ మిస్సింగ్ కేసులో ఎన్ని మిస్టరీలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసు వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
21 ఏళ్ల జష్న.. ముండకాయమ్‌లోని బంధువుల ఇంటికి వెళుతున్నానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లింది. రాత్రి అయింది. ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. పుంచవాయల్‌లో ఉన్న బంధువుల ఇంటికి జష్న తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఆమె అక్కడికి రాలేదని తెలిసింది. దీంతో వారు షాక్ అయ్యారు. బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకుపోయిన అమ్మాయి ఎక్కడికి వెళ్లింది. ఆమె ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఫోన్ తీసుకెళ్లకుండా జష్న ఎక్కడికి వెళ్లింది? తల్లిదండ్రుల మనసు ఏదో కీడు శంకించింది. జష్న ఫ్రెండ్స్‌కు.. ఇతర పరిచయస్తులకు ఫోన్ చేశారు. లాభం లేకపోయింది. జష్న తండ్రి జేమ్స్ జోషఫ్ అదే రోజు ఇరుమెలి పోలీసులకు జష్న కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఓ ట్విస్ట్ ఇచ్చారు. వెచ్చురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారు. కేసును ఆ స్టేషన్‌కు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇరుమెలి పోలీసులు.. మాట ఇచ్చిన విధంగా చేయలేదు. జోష్న తండ్రి మాత్రం వెచ్చురి స్టేషన్‌కు వెళ్లాడు. కూతురు మిస్సింగ్ గురించి.. ఇరుమెలి స్టేషన్‌లో ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్పారు. అయితే, పోలీసులు జష్నను వెతకటంలో అలసత్వం వహించారు. జష్న తన బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయి ఉంటుందని, కొన్ని రోజులు ఆగి ఆమే ఇంటికి వస్తుందని చెప్పారు. దాదాపు రెండు వారాల తర్వాత ఇరుమెలి పోలీస్ స్టేషన్‌నుంచి జష్న మిస్సింగ్ కేసు.. వెచ్చురి స్టేషన్‌కు పార్వర్డ్ అయింది. కేసు అధికారికంగా స్టేషన్‌కు రావటంతో పోలీసుల్లో చలనం మొదలైంది. దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు.
కేసు రిపోర్టు వచ్చిన తర్వాత వెచ్చురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా మిస్ అయిందన్న దాన్ని ట్రాక్ చేయసాగారు. ఆమె ట్రావెల్ ప్లాన్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె ఇంటినుంచి వెళ్లిపోయినట్లు తేలింది. 2018, మార్చి 22న ఫ్యాన్సీ, జేమ్స్ జోషఫ్‌ల కూతురు జష్న కొల్లములలోని ఇంటినుంచి బంధువుల ఇంటికని బయలు దేరింది. కొల్లములనుంచి ఆటోలో బస్‌స్టాండ్‌కు వెళ్లింది. అక్కడినుంచి బస్‌లో ఇరుమెలికి బయలుదేరింది. ఇరుమెలినుంచి బస్‌లో ముండకాయమ్ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే తన తోటి ప్రయాణికులతో ముండకాయమ్ వెళ్లే రూటు గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ బంధువు ఆమెను చూశాడు. ఆమె అతడ్ని పట్టించుకోకుండానే వెళ్లిపోయింది. బంధువుతో పాటు మరికొంతమంది తెలిసిన వాళ్లు కూడా ఆమెను చూశారు. వారిని కూడా జష్న పట్టించుకోలేదు.
పోలీసుల దర్యాప్తు ఇంకా మొదలు కాని సమయంలో.. జష్న బంధువులు కొన్ని సీసీటీవీ ఫొటేజీలను సంపాదించారు. ముండకాయమ్‌లోని ‘శివగంగ బ్యాంక్’దగ్గరి సీసీటీవీ కెమెరా దృశ్యాలవి. బ్యాంకు దగ్గరి సీసీ కెమెరా దృశ్యాల్లో జష్న కనిపించింది. ఆమె బ్యాంకు దగ్గర కూర్చుని ఉంది. బ్యాంకు పక్కన ఉన్న ఓ ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాల్లో కూడా ఆమె అక్కడ కూర్చుని ఉన్నట్లు తేలింది. పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత.. సీసీటీవీ ఫుటేజీలు వారికి చేరాయి. అయితే, బ్యాంకు దగ్గర కూర్చున్నది జష్ననే అని చెప్పలేమని పోలీసులు అన్నారు. అంతేకాదు! జష్న అసలు ముండకాయమ్ వెళ్లిందా? లేదా? అని తేల్చడానికి ఎటువంటి ఆధారాలను పోలీసులు సేకరించకపోవటం గమనార్హం.
జష్నకు ఓ గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగులో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండేవాళ్లు. ఆమె ప్రతి రోజూ క్రమం తప్పకుండా వారితో మాట్లాడేది. వారిలో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అతడు జష్న క్లాస్‌మేట్. పోలీసులు ఆ అబ్బాయిని కూడా చాలా సార్లు విచారించారు. అయినా వారికి ఎలాంటి ఉపయోగం లేకపోయింది. పోలీసులు జష్నతో పాటు బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల్ని విచారించగా.. ఆమె ముండక్కాయమ్‌నుంచి చెన్నై వెళ్లినట్లు తెలియవచ్చింది. దీంతో కేరళ పోలీసులు చెన్నై వెళ్లారు. అక్కడ ఆమె కోసం వెతకసాగారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్ కారణంగా దర్యాప్తు ఆగిపోయింది.
పోలీసులు జష్న కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతూ వస్తున్నాయి. కేసు దర్యాప్తు మొదలై నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవటంతో అసెంబ్లీలో దీనిపై రచ్చ జరిగింది. అసెంబ్లీలో రచ్చ కారణంగా కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో.. కూడతాయి సైనేడ్ జాలీ కేసును ఛేదించిన కేజీ సీమాన్ కూడా రంగంలోకి దిగారు. సైంటిఫిక్ మెథడ్స ద్వారా వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె దైనందిన అలవాట్లను తెలుసుకోవటానికి బంధువులు, కుటుంబసభ్యులు, క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ ఇలా చాలా మందిని విచారించారు. ఇంటినుంచి ఆమె ఒక్కత్తే వెళ్లిందా లేక ఆమె వెంట ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగింది.
జష్న గురించిన విషయాలు తెలుసుకోవటానికి పోలీసులు కొన్ని ఊర్లలో సమాచార బాక్సులను సైతం ఏర్పాటు చేశారు. ఆమె గురించి తెలిసిన వాళ్లు.. పేపర్‌లో వివరాలు రాసి దాంట్లో పడేయాలని పేర్కొన్నారు. జష్న గురించి తెలుసుకోవటానికి పోలీసులు ఏకంగా 300 మందిని విచారించారు. 150 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అంతేకాదు! జష్నను కనిపెడితే రెండు లక్షలు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. తర్వాత దాన్ని 5 లక్షలకు పెంచారు. పోలీసులకు లక్షల కాల్స్ వచ్చాయి కానీ, ఎలాంటి లాభం లేకపోయింది.
క్రైమ్ బ్రాంచు కేసును దర్యాప్తు చేసినా పెద్దగా ఎలాంటి లాభం లేకపోయింది. జష్న ఏమైందన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. జష్న సోదరుడు ఈ కేసుపై కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. క్రైమ్ బ్రాంచ్ విచారణతో తమకు సరిగా న్యాయం జరగటం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జష్న కేసును సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ దర్యాప్తు మొదలైంది. పోలీసులు నమోదు చేసిన విధంగానే.. సీబీఐ కూడా ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. సీబీఐ దాదాపు ఆరేళ్ల పాటు సుధీర్ఘ దర్యాప్తు చేసింది. జష్నకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్క పోవటంతో సీబీఐ చేతులు ఎత్తేసింది.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ తమ దర్యాప్తును ముగించింది. తుది రిపోర్టును కోర్టుకు అందించింది. జష్న ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? ఆమె ఎలా ఉంది? అన్న విషయాలను తాము కనిపెట్టలేకపోయామని కోర్టుకు తెలిపింది. జష్న మిస్సింగ్ లో ఆమె తండ్రి, ఫ్రెండ్ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు! కేసులో కేరళ పోలీసుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. జష్న కనిపించకుండా పోయిన 48 గంటల్లో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని సీబీఐ తెలిపింది. తమకు జష్న బతికి ఉన్నట్లు సమాచారం అందిందని, కానీ, అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ఆమె మిస్సింగ్ కు సంబంధించి ఏదైనా కొత్త అప్‌డేట్ వస్తే.. కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామని తెలిపింది.
జష్న బతికి లేదని కొందరు అంటుంటే.. చనిపోయిందని ఇంకా కొందరు అంటున్నారు. మరి కొందరు జష్న సిరియా వెళ్లిపోయిందని, అక్కడే ఉంటోందని కూడా అంటున్నారు. కానీ, ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అసలు బతికి ఉందా? లేదా? ఉంటే ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు కేరళ వాసుల మెదడుల్ని తొలిచేస్తున్నాయి. జష్న కుటుంబసభ్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. తమ బిడ్డ బతికుందా? చనిపోయిందా? అన్న క్లారిటీ లేక.. కూతురి మీద ఆశలు చంపుకోలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
తమ కూతురు ఎప్పటికైనా ఇంటికి తిరిగివస్తుందనే నమ్మకంతో బతుకుతున్నారు. జష్న అక్కడ ఉంది? ఇక్కడ ఉంది? అని వస్తున్న పుకార్లతో వారిలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. అవి నిజాలు కాదని తెలిసిన వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూతురి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి, పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులకే ముప్ప తిప్పలు పెట్టిన.. ఆరేళ్లు అయినా జాడ లేని జష్న కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.