ఏ సమస్యా లేదు.. అయినా ఇంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో

వారిది అన్యోన్య దాంపత్యం. ఎలాంటి కష్టాలు లేవు. ఇక జీవితంలో గొప్పగా స్థిర పడాలని భావించి అమెరికా వెళ్లారు. గత తొమ్మిదేళ్లుగా వారు అగ్రరాజ్యంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మంచి జీతం.. అందమైన జీవితం. వీటికి తోడు ముద్దులొలికే ఆరేళ్ల కొడుకు.. అంతా బాగుంది.. జీవితం హాయిగా సాగిపోతుంది అనుకున్నారు దంపతుల తల్లిదండ్రులు. మరి ఏం జరిగిందో తెలియదు.. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ చిన్న పిల్లాడిని ఎలా చంపాలనిపించింది అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆ వివరాలు..

దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్‌ హొన్నాళ(37), ప్రతిభా (35) దంపతులు అమెరికా, మేరిల్యాండ్‌లోని బాల్టిమోర్‌ నగరంలో నివసిస్తున్నారు. గత 9 ఏళ్లుగా వీరిద్దరూ ఐటీ ఇంజనీర్లుగా పని చేస్తూ.. అమెరికాలోనే సెటిల్‌ అయ్యారు. వీరికి 6 ఏళ్ల కుమారుడు యశ్‌ ఉన్నాడు. వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని యోగేశ్‌, ప్రతిభల తల్లిదండ్రులు వెల్లడించారు. కొడుకుతో కలిసి ఎంతో సంతోషంగా ఉండేవారని.. ఏడాది, 2 ఏండ్లకు ఒక్కసారి ఇండియా వచ్చి.. కొన్ని రోజుల పాటు తమతో కలిసి ఉండేవారని చెప్పుకొచ్చారు.

ఇక గురువారం కూడా యోగేశ్‌.. దావణగెరెలోని తన తల్లి శోభతో ఫోన్‌లో మాట్లాడాడు. అప్పుడు కూడా వారు బాగానే ఉన్నారు. బాధపడుతున్నట్లు, ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదని శోభ తెలిపింది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. యోగేశ్‌, అతడి భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. బాల్టిమోర్‌ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంతో సంతోషంగా ఉన్న తమ బిడ్డలు ఇంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాక.. యోగేశ్‌, ప్రతిభల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక తమ బిడ్డల మృతదేహాలను త్వరగా ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఇరువురి కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Show comments