P Venkatesh
ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాంద్యం కారణంగా ఉద్యోగాలు పోవడంతో సైబర్ మోసాలకు పాల్పడడం మొదలుపెట్టారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాంద్యం కారణంగా ఉద్యోగాలు పోవడంతో సైబర్ మోసాలకు పాల్పడడం మొదలుపెట్టారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
P Venkatesh
కొంతకాలం నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక టెన్షన్ తో గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఓ వైపు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తుండడం.. మరోవైపు కొత్తగా రిక్రూట్ మెంట్స్ జరగకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ఇదే విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు సరికొత్త దందాకు తెరలేపారు. ఈజీ మనీకోసం అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ అవతారమెత్తి నిరుద్యోగులను టార్గెట్ చేసి లక్షల్లో మోసాలకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన శివప్రసాద్, రంగపార్థుడు సైబర్ మోసాలకు పాల్పడుతూ.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో 12 మోసాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ముచ్చు శివప్రసాద్ ఫేక్ సర్టిఫికేట్లతో హైదరాబాద్, బెంగళూరులోని పలు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. కొంతకాలం తర్వాత ఐటీ ఉద్యోగం పోయింది. కాగా శివప్రసాద్ 2017లో ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న సమయంలో తోటి ఉద్యోగి ధన్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఉద్యోగ వేటలో ఉన్న ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన భట్టుగారి రంగపార్థుడితో కలిసిపోయారు. అప్పటినుంచి సైబర్ మోసాలకు తెరలేపారు వీరు ముగ్గురు.
నిరుద్యోగులే లక్ష్యంగా. డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రంగపార్థు నమ్మించాడు. అతని వద్ద నుంచి రూ.1.6 లక్షలు వసూలు చేసి నకిలీ నియామకపత్రం అందించాడు. ఆ నియామక పత్రాన్ని బాధితుడు మైండ్‌స్పేస్‌లోని డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీ సెస్ సంస్థ ప్రతినిధులకు చూపించగా అసలు మోసం వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధిత యువకుడు జనవరి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ అందుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితులు శివప్రసాద్, రంగపార్థుడుని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ధన్‌రాజ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.