iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో దారుణం..రెస్టారెంట్‌ సిబ్బంది దాడి.. కస్టమర్‌ మృతి

  • Published Sep 11, 2023 | 12:22 PMUpdated Sep 11, 2023 | 12:22 PM
  • Published Sep 11, 2023 | 12:22 PMUpdated Sep 11, 2023 | 12:22 PM
హైదరాబాద్‌లో దారుణం..రెస్టారెంట్‌ సిబ్బంది దాడి.. కస్టమర్‌ మృతి

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.. భోజనం చేయడం కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్‌ మీద సిబ్బంది దాడి చేయడంతో.. అతడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన.. హైదరాబాద్‌, మెరిడియన్‌ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. బిర్యానీ తినేందుకు వెళ్లిన యువకుడు సిబ్బందిని ఎక్స్‌ట్రా పెరుగు అడగటంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో మాటా మాటా పెరగడం ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన సిబ్బంది సదరు యువకుడిపై దాడి చేయడంతో.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన వివరాలు..

పాతబస్తీ చాంద్రాయణగుట్టకి చెందిన లియాకత్‌ అనే యువకుడు.. ఆదివారం అనగా సెప్టెంబర్‌ 10వ తేదీ రాత్రి.. పంజాగుట్టలోని మెరిడియన్‌ హోటల్‌కి బిర్యానీ తినేందుకు వెళ్లాడు. లియాకత్‌ ఆర్డర్‌ ప్రకారం సిబ్బంది బిర్యానీ తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత అతడు ఎక్స్‌ట్రా పెరుగు తీసుకురావాలని రెస్టారెంట్‌ సిబ్బందిని కోరాడు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, లియాకత్‌కి మధ్య గొడవ మొదలైంది. దాంతో మెరిడియన్‌ రెస్టారెంట్‌ సిబ్బంది.. లియాకత్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. లియాకత్‌తో పాటు మెరిడియన్‌ హోటల్‌ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌ స్టేషన్‌లో మాట్లాడుతుండగానే లియాకత్‌ ఉన్నట్లుండి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని పక్కనే ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తలరించారు. అక్కడ చికిత్సపొందుతూ లియాకత్‌ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు డెక్కన్ హాస్పిటల్‌ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. దాడి జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతోనే లియాకత్‌ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరిడియన్‌ హోటల్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి