Dharani
Dharani
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవల్లి రంగశాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి భార్య.. లహరి రెడ్డి ఈ నెల 14న అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయిందని.. వల్లభ్ రెడ్డి చెబుతుండగా.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మాత్రం అంతర్గత గాయలైనట్లు వెల్లడయ్యింది. దాంతో వల్లభ్‌రెడ్డిపై హత్య కేసు నమోదయ్యింది. ప్రస్తుతం పోలీసులు లహరి గుండెపోటు వల్ల మృతి చెందిందా.. లేక హత్య చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవల్లి రంగశాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డికి, హైకోర్టు ఉద్యోగి అయిన కోతి జైపాల్‌రెడ్డి కుమార్తె లహరిలకు వివాహం య్యింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న లహరికి గుండెపోటు వచ్చిందంటూ ఆమె భర్త వల్లభ్ రెడ్డి.. ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లహరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. లహరి తల్లిదండ్రుల వచ్చే లోపు ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
తన అల్లుడు, కుమార్తె పెళ్లైన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. తమ కుమార్తె అత్తింటి వారిపై తమకు ఎలాంటి అనుమానం లేదని లహరి తల్లిదండ్రులు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. అయితే వల్లభ్‌రెడ్డి తీరును అనుమానించిన పోలీసులు.. లహరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇటీవల వచ్చిన పోస్టుమార్టం నివేదికలో లహరి శరీరంలో అంతర్గత గాయాలైనట్లు వెల్లడైంది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు ఈ నెల 26 వల్లబ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 201, 302 సెక్షన్ల కింద కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించారు. లహరి తల్లిదండ్రులను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారా.. అసలు లహరిది హత్యా.. గుండెపోటా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.