కానిస్టేబుల్‌ కన్నింగ్‌ బుర్ర.. లేడీ కానిస్టేబుల్‌ను చంపి..

పోలీస్‌ నేరస్తుడిగా మారితే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూసుంటాము. కానీ, నిజ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి అరుదైన సంఘనల్లో ఇది కూడా ఒకటి. ఓ మగ కానిస్టేబుల్‌.. ఆడ కానిస్టేబుల్‌ను చంపి రెండేళ్లపాటు దొరక్కుండా తప్పించుకున్నాడు. చివరకు పాపం పండి దొరికాడు.  పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన మోనా 2014లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరింది. రానా అనే వ్యక్తి అంతకంటే రెండేళ్ల ముందు డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఈ ఇద్దరికీ ఒకేసారి కంట్రోల్‌ రూములో డ్యూటీ పడింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తర్వాత ఆమెకు ఉత్తర ప్రదేశ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో మోనా కానిస్టేబుల్‌ జాబ్‌ మానేసింది. మోనా జాబ్‌ మానేసినా, రానా ఆమెతో కాంటాక్ట్‌లో ఉండేవాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డం మొదలెట్టాడు. అతడి దుర్భుద్ధి అర్థం చేసుకున్న మోనా.. అతడ్ని దూరం పెట్టసాగింది. మోనా తనను దూరం పెట్టడం రానా తట్టుకోలేకపోయాడు. 2021,సెప్టెంబర్‌ 8న ఇద్దరికీ గొడవ అయింది. దీంతో ఆమెను ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకుపోయాడు.

అక్కడ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి.. రాళ్లతో కప్పిపెట్టాడు. నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు కొత్త డ్రామా మొదలెట్టాడు. మోనా కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ‘మీ కూతురు అరవింద్‌ అనే వ్యక్తితో లేచి పోయింది’ అని చెప్పాడు. తర్వాతి నుంచి మోనా ఫ్యామిలీతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఆమె కోసం వెతుకుతున్నట్లు డ్రామా ఆడాడు. వారితో పాటు కలిసి పోలీస్‌ స్టేషన్‌కు పలు సార్లు వెళ్లాడు. ఆమె పేరుతో కరోనా వ్యాక్సిన్‌ వేయించాడు. ఆమె సిమ్‌ కార్డు వాడేవాడు. డబ్బులు కూడా డ్రా చేసేవాడు. ఓ రోజు అరవింద్‌ ఫోన్‌ నెంబర్‌ దొరికిందంటూ ఓ నెంబర్‌ వారికి ఇచ్చాడు.

ఆ నెంబర్‌కు పోన్‌ చేయగా.. ఓ వ్యక్తి మాట్లాడాడు. అతడు రానా మనిషే. మోనా ఫ్యామిలీ ఫోన్‌ చేసినపుడు.. మోనా తనతో ఉందని చెప్పాడు. మోనాతో మాట్లాడించమని అడిగితే.. ‘ ఆమె భయపడిపోయింది. తర్వాత మాట్లాడుతుంది’ అని చెప్పాడు. కొన్ని సార్లు రికార్డు చేసిన మోనా మాటల్ని వినిపించే వారు. మోనా తల్లిదండ్రులు క్రైం బ్రాంచును ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. రానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురికి కాల్వలోని మోనా ఎముకల్ని వెలికి తీశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments