Krishna Kowshik
Krishna Kowshik
సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలోని దీప్తి అనే మహిళ ఈ నెల 29న తన నివాసంలో మృతి చెందిన సంగతి విదితమే. కాగా, ఇంట్లో చెల్లెలు చందన కనిపించకుండా పోవడంతో పాటు.. దీప్తి శరీరంపై పలు గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెల్లెలు చందన ఓ బస్టాండులో ప్రియుడితో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు పోలీసులు. అయితే ఆమె చందన కాదని తర్వాత నిర్ధారించుకున్నారు. ప్రేమికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు ప్రేమ జంటను ఒంగోలులో పట్టుకున్నారు. దీప్తి చెల్లెలు చందన మరియు ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమికుడి కోసం సొంత అక్కను పొట్టనబెట్టుకుంది చెల్లెలు చందన.
ఒంగోలు నుండి 25 ఏళ్ల క్రితమే కోరుట్లక వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు. ఇటుక బట్టీ వ్యాపారం చేసేవారు. దంపతులకు ఇద్దరు కూతుర్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. దీప్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా, చందన చదువు మధ్యలోనే ఆపేసింది. కాగా, ఈ నెల 29న దీప్తి ఇంట్లో అనుమానాస్పద రీతిలో చనిపోగా.. చెల్లెలు చందన అదృశ్యం అయ్యింది. పోలీసుల ప్రవేశంతో కేసు పలు మలుపులు తీసుకుంది. ఇంట్లో డబ్బులు, నగదు తీసుకుని పరారయ్యింది ప్రేమికుల జంట. కాగా, సోదరుడికి పెట్టిన వాయిస్ మెసేజ్ లో తాను అక్కను చంపలేదంటూ చెప్పుకొచ్చింది చందన. అక్క, తాను కలిసి మద్యం సేవించడం.. ఆమె మత్తులోకి వెళ్లిపోయాక.. ఇదే అదునుగా భావించి.. నగలు తీసుకుని తన ప్రేమికుడితో వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు పోలీసులు వీరిద్దరిని ఒంగోలులో పట్టుకొని విచారించగా.. షాక్ అవ్వడం పోలీసులు వంతైంది. తమ మతాలు వేరని, తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలిపింది. అక్క దీప్తి కూడా ఒప్పుకోకపోవడంతో గొడవపడినట్లు చెప్పింది. ఆ సమయంలో అక్క ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు తెలిపింది. ఇందులో ప్రియుడు, ఆమె తల్లి హస్తం ఉన్నట్లు కూడా వెల్లడించింది. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశాలున్నాయి.