iDreamPost
android-app
ios-app

రామోజీరావుకు భారీ షాక్‌.. చీటింగ్‌ కేసు నమోదు!

  • Published Jul 21, 2023 | 11:01 AM Updated Updated Jul 21, 2023 | 11:01 AM
  • Published Jul 21, 2023 | 11:01 AMUpdated Jul 21, 2023 | 11:01 AM
రామోజీరావుకు భారీ షాక్‌.. చీటింగ్‌ కేసు నమోదు!

ఈనాడు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ కంపనీ లిమిటెడ్‌ యజమాని రామోజీరావుకు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మార్గదర్శి చిట్స్‌లో మోసాలపై ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తాను సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్‌లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా తనను ఇబ్బందులకు గురి చేస్తోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మార్గదర్శి యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌తో పాటు ఇతర సిబ్బందిపై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చీటింగ్‌ కేసు సహా పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రామోజీరావు, శైలజా కిరణ్‌తో పాటు ఇతర సిబ్బంది మీద 409 (క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌), 420 (చీటింగ్‌), 120బి, సెక్షన్‌ 5 ఆఫ్‌ ది ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితుడు 64 ఏళ్ల ముష్టి శ్రీనివాస్‌ టాక్స్‌ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెండేళ్ల క్రితం అనగా 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్‌ వేశారు.

50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్‌లో పాల్గొన్నారు శ్రీనివాస్‌. సుమారు ఏడాదిన్నరకు పైగా అనగా 19 నెలలు.. ప్రతి నెల రూ. లక్ష చొప్పున రూ.19 లక్షల చిట్‌ నగదు సక్రమంగానే చెల్లించారు. అయితే ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం శ్రీనివాస్‌ రూ. 37.50 లక్షలకు చిట్‌ పాడారు. నాలుగు నెలలు అవుతున్నప్పటికి మార్గదర్శి యాజమాన్యం ఇప్పటి వరకు శ్రీనివాస్‌ పాడిన చిట్‌ మొత్తాన్ని ఆయనకు ఇవ్వలేదు. ఆయన చెల్లించిన నగదును కూడా తిరిగి ఇవ్వలేదు. దాంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.

చిట్‌ఫండ్‌ కంపెనీకి సంబంధించి ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్‌ ఖాతా ఉండాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీకి మాత్రం బ్రాంచ్‌లో ఒకే బ్యాంక్‌ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని బాధితుడు తన ఫిర్యాదులో వెల్లడించారని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నామని మరి కొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.