iDreamPost
android-app
ios-app

యువకులను తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 03, 2023 | 12:12 PM Updated Updated Sep 03, 2023 | 12:12 PM
యువకులను తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. అసలు ఏం జరిగిందంటే?

మానవత్వం మరిచి ఓ ఇద్దరు యువకులపై కౄరంగా వ్యవహరించారు కొందరు వ్యక్తులు. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండానే అమానుషంగా వ్యవహరించారు. ఈ షాకింగ్ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మధ్య మనుషుల్లో మానవత్వం అడుగంటి పోతోంది. సాటి వ్యక్తులపై జాలి కరుణ అనేదే లేకుండా పోతోంది. ఆ యువకుల పట్ల వారు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది. దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరు యువకులను తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగ పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఏ మాత్రం కనికరం లేకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దీనికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ యువకులను ఎందుకు బందించారు. వారు చేసిన తప్పు ఏంటీ? ఆ వివరాలు మీ కోసం..

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ కుటుంబం పశువుల కాపరిగా ఉన్న ఓ యువకుడిని, అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి నరకం చూపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్‌ అంగడిబజార్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు మేకలను పెంచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దీని కోసం నగర శివారులో ఓ షెడ్డు నిర్మించుకుని మేకలు పెంచుతున్నారు. అయితే ఇదే కుటుంబంలో తేజ అనే యువకుడు వారితో కలిసి నివసిస్తూ పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరి మేకల షెడ్డు నుంచి ఓ మేక పోయినట్లు గుర్తించారు.

అయితే ఆ మేకను వారి ఇంట్లో ఉంటున్న తేజతో పాటు అతడి స్నేహితుడు కిరణ్ దొంగిలించినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే మేకల యజమానులు తేజ అతడి స్నేహితుడు కిరణ్ ను శుక్రవారం షెడ్డు వద్దకు పిలిపించారు. వీరిద్దరు అక్కడికి చేరుకోగానే వారిపై దాడికి పాల్పడ్డారు. తేజ, కిరణ్ లను తీవ్రంగా కొట్టి తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీశారు. అంతటితో ఆగకుండా కింద పొగ పెట్టి హింసించారు. ఆ తరువాత వారిని వదిలేశారు. అయితే యువకులపై దాడికి పాల్పడిన ఫొటోలు బయటకు రావడంతో కిరణ్ దగ్గరి బందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్‌ తో పాటు వారి వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తి నరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.