iDreamPost
android-app
ios-app

Nellore: ప్రేమ పెళ్లి.. కానీ ఏం లాభం.. బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా

  • Published Aug 11, 2024 | 11:42 AM Updated Updated Aug 11, 2024 | 1:03 PM

AP Nellore Couple Death: ఆవేశంలో దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నారుల జీవితం ప్రశ్నార్థకమైంది.

AP Nellore Couple Death: ఆవేశంలో దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నారుల జీవితం ప్రశ్నార్థకమైంది.

  • Published Aug 11, 2024 | 11:42 AMUpdated Aug 11, 2024 | 1:03 PM
Nellore: ప్రేమ పెళ్లి.. కానీ ఏం లాభం.. బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. దాంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లై నాలుగేళ్లవుతుంది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు బిడ్డలు జన్మించారు. వారిలో ఒకరి వయసు 3 ఏళ్లు కాగా.. మరొక బిడ్డకు 11 నెలలు. ఇక అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో విధి చిచ్చు పెట్టింది. దాంతో కనీసం పసి వాళ్ల గురించి కూడా ఆలోచించకుండా దారుణ నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు చేసిన పనికి ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆ వివరాలు..

భర్త మద్యానికి బానిస కావడంతో.. తట్టుకోలేకపోయిన ఆ మహిళ.. ఆత్మహత్య చేసుకుంది. భార్య లేని లోకంలో ఉండలేనని భావించిన ఆ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అభంశుభం తెలియని పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర సంఘటన నెల్లూరు జిల్లాలో శనివారం నాడు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19)లది ప్రేమ వివాహం. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమలకు గుర్తుగా ఇద్దరు సంతానం కూడా జన్మించారు. మూడేళ్లు, 11 నెలల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక నాగరాజు టైల్స్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేశాడు. సురేఖ మాగుంట లేఅవుట్‌లో ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా చేస్తుంది. సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చు పెట్టింది.

గత కొన్నాళ్లుగా నాగరాజు తాగుడుకి బానిసయ్యాడు. సంపాదించిన డబ్బంతా మద్యం సేవించడం కోసం ఖర్చు చేసేవాడు. అది చాలదన్నట్లు అప్పులు కూడా చేశాడు. దాంతో కుటుంబ భారం మొత్తం సురేఖపై పడింది. తాగుడు మానలని, అప్పులు చేయవద్దని సురేఖ భర్తను వేడుకుంది. కానీ నాగరాజు భార్య మాటలు వినలేదు. పైగా పుట్టింటికి వెళ్లి డబ్బులు తేవాలని వేధించసాగాడు.  దాంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరిగేవి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో సంతోషంగా సాగుతున్న జీవితం ఇలా మారడంతో విసిగిపోయిన సురేఖ శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సురేఖను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. భార్య మరణించిన విషయం తెలుసుకున్న నాగరాజు పరుగుపరుగున ఆసుపత్రికి వచ్చాడు. విగతజీవిగా మారిన భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఇక తన వల్లే భార్య సురేఖ మరణించిందని.. ఆమె లేని లోకంలో తాను బతకలేనంటూ ఆసుపత్రి పక్కనే ఉన్న విజయమహల్‌ గేటు రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేఖ తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్యభర్తలిద్దరూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అభంశుభం తెలియని బిడ్డలు అనాథలుగా మారారు. అమ్మనాన్నల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసివాళ్లను చూసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు.